ఈరోజుల్లో సోషల్ మీడియా (Social Media) వినియోగం మితిమీరిపోయింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రజలు ఆన్లైన్ పోర్టల్స్‌లో గంటల తరబడి గడుపుతున్నారు. ముఖ్యంగా 10 ఏళ్లు దాటిన పిల్లలు సోషల్ మీడియాకు అతుక్కుపోతున్నారు. అయితే, తమ పిల్లల మానసిక పరిస్థితిపై సోషల్ మీడియా తీవ్ర ప్రభావం చూపుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫేస్బుక్, టిక్ టాక్, ఇన్స్టాగ్రాం, స్నాప్ చాట్ వేదికలను బ్లాక్ చేయాలని అమెరికాలోని వాషింగ్టన్లో ఉన్న సియాటెల్ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు అక్కడి డిస్ట్రిక్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. సోషల్ మీడియాతో చిన్నారులు పొందే లబ్ధి కన్నా అధికంగా అనర్థాల బారిన పడుతున్నారనడానికి ఇదొక బెస్ట్ ఉదాహరణ.
* అధిక ప్రభావం : సోషల్ మీడియా వాడకం, అతి వాడకానికి మధ్య సన్నని గీత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆ గీతను దాటడంతో అనేక పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని రౌండ్‌గ్లాస్(RoundGlass) సంస్థకు చెందిన మెంటల్ అండ్ వెల్బియింగ్ గ్లోబల్ అధినేత ప్రాకృతి పొడ్డార్ వెల్లడించారు. ‘సోషల్ మీడియా వినియోగంపై చిన్నారులకు సరైన విచక్షణ ఉండదు. ఎంతవరకు వాడాలి? ఎలాంటివి చూడాలి? అనే వాటిపై అవగాహన ఉండదు. ఫలితంగా ఎక్కువ సేపు కాలక్షేపం చేస్తూ ఉంటారు. తద్వారా సోషల్ మీడియాకు బానిసై మానసికంగా కుంగిపోతుంటారు. సోషల్ మీడియాలో చేసిన పోస్టులకు సరైన రెస్పాన్స్ రాకపోతే ఆందోళనకు గురవుతారు’ అంటూ ప్రాకృతి హెచ్చరించారు.
* శరీరంలో అసహజ మార్పు : మితిమీరిన సోషల్ మీడియా వినియోగం వల్ల శరీరంలో అసహజ మార్పు కలుగుతుందని క్లినికల్ సైకాలజిస్టు డా. ప్రీతి సింగ్ వెల్లడించారు. తమ పిల్లలు సోషల్ మీడియా వాడుతున్న తీరును పెద్దలు తెలుసుకోలేక పోతున్నారని ప్రీతి సింగ్ చెప్పారు. ‘చాలామందికి తమ పిల్లలు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారో తెలియదు. బాగానే ఉన్నారు కదా అని అనుకుంటుంటారు. క్రమంగా సోషల్ మీడియా వినియోగం.. పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది’ అని ప్రీతి సింగ్ వెల్లడించారు.
* రుగ్మతలకు దారితీయొచ్చు : అధిక మోతాదులో సోషల్ మీడియాలో గడపడం వల్ల భవిష్యత్తులో అనేక రుగ్మతలకు(Disorder) దారితీసే ప్రమాదం ఉందని పీడియాట్రిషియన్ డా. సి.పి. సింగ్ అభిప్రాయపడ్డారు. తీవ్ర ఆందోళన కలుగుతుందని హెచ్చరించారు. అధిక సోషల్ మీడియా వినియోగం నుంచి బయట పడటానికి పెద్దలు వివిధ పద్ధతులను పాటించాలని తెలిపారు. పిల్లలతో పాటలు పాడించడం, బొమ్మలు గీయించడం, ఆటలు ఆడించడం వంటి కార్యకలపాలను చేయాలని సి.పి. సింగ్ సూచించారు.
* ఇలా చేయండి : చెప్పడం కన్నా ఆచరించి చూపడం ఉత్తమం. కాబట్టి, ముందుగా పెద్దలే ఈ ఇనిషియేటివ్‌ని తీసుకోవాలి. సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించాలి. తద్వారా పిల్లలకు సూచించాలి. భోజన సమయాల్లో ఫోన్‌ని పక్కన పెట్టేలా చూడాలి. సోషల్ మీడియా వినియోగానికి ప్రత్యేకంగా టైం కేటాయించుకోవాలి. ఆ సమయాల్లో తప్ప మిగతా వేళల్లో వాటి జోలికి వెళ్లొద్దు. పిల్లలు దీన్ని ఆచరించేలా చూడాలి.
డివైజ్‌లలో ‘పేరెంట్ కంట్రోల్స్’ ఆప్షన్ని ఎనేబుల్ చేయాలి. లేదంటే పోర్న్ వంటి కంటెంట్‌కి చిన్నారులు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉంటుంది. సోషల్ మీడియాని ఎలా వినియోగించాలో పిల్లలకు సానుకూలంగా చెప్పాలి. అవగాహన కల్పించాలి. ఏ అవసరమొచ్చినా మేమున్నామనే భరోసా పిల్లలకు ఇవ్వాలి. వారితో కాసేపు సరదాగా గడపాలి. సోషల్ మీడియా గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా నడుచుకోవాలి. ఏజ్ కటాఫ్ ఉన్న అకౌంట్ల విషయంతో జాగ్రత్తలు తీసుకోవాలి.