బరువు తగ్గాలనుకునేవారికి డ్రాగన్ ఫ్రూట్స్ బెస్ట్ పండ్లు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఎక్కువ కేలరీలు ఉండవు. ఇందులోని గుజ్జు తెలుపు రంగులో ఉంటుంది. మధ్యలో గింజలుంటాయి. ఇవి అరటిపండ్లలో గింజల్లా ఉంటాయి. అందువల్ల ఈ పండును తినేవారు గింజలతో సహా తింటారు. కరకరలాడే ఆ గింజలు అందరికీ నచ్చుతాయి. ఈమధ్య ఈ పండ్లలో కూడా రకాలు వచ్చాయి. లోపల గుజ్జు కూడా గులాబీ రంగులోనే ఉండేలా మార్పులు చేశారు.
ప్రస్తుతం ఈ పండ్లు సూపర్ మార్కెట్లలో కనిపిస్తున్నాయి. ఒక్కో పండు (సుమారు 400 గ్రాములు బరువు ఉండేది) ధర రూ.70 నుంచీ రూ.100 దాకా ఉంటుంది. రేటు ఎక్కువైనా కొంతమంది వీటిని కొనుక్కుంటున్నారు. కొంతమంది టేస్ట్ చూద్దామని కొంటున్నారు. ఇంతకీ ఈ పండ్ల రుచి ఎలా ఉంటుందో చెప్పలేదు కదా. ఇవి కొద్దిగా పుల్లగా, కొద్దిగా తీపిగా ఉంటాయి. మరీ ఎక్కువ తీపిదనం ఉండవు.
ఒక్కమాటలో చెప్పాలంటే... తాటి ముంజులు తెలుసుకదా... డ్రాగన్ పండ్ల రుచి కూడా తాటి ముంజుల లాగే ఉంటుంది. అలాంటప్పుడు వీటి బదులు ముంజులే తింటే సరిపోతుంది కదా అని మీకు అనిపించవచ్చు. వేటి ఆరోగ్య ప్రయోజనాలు వాటికి ఉంటాయి కాబట్టి... సీజన్లో వచ్చే డ్రాగన్ ఫ్రూట్స్‌ని కూడా టేస్ట్ చూడాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.