ముఖం అందంగా మెరిసిపోతూ ఉండాలని.. చక్కటి గ్లో తో హీరోయిన్ లా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ప్రస్తుతం మనం ఉపయోగించే చర్మ ఉత్పత్తులు, కాలుష్యం, మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ముఖ చర్మం మెరుపును కోల్పోతుంది. మొటిమలు, మచ్చలు, ముడతలు లాంటి ఎన్నో సమస్యలతో కళ లేకుండా అయిపోతుంది. అయితే ఈ చిన్న టిప్స్ పాటిస్తే చాలు.. చర్మం అందంగా మెరవడాన్ని మీరే గమనించవచ్చు.
మసాజ్ చేయండి.. : అప్పుడప్పుడూ మీ చర్మానికి మసాజ్ అనేది అవసరం. దీనివల్ల మీకు హాయిగా అనిపించడంతో పాటు మీ చర్మానికి రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. మిగిలిన భాగాలతో పాటు ముఖానికి కూడా మసాజ్ చేసుకోవడం వల్ల ముఖం మెరిసిపోతుంది. ముఖంపై ఉన్న ముడతలు, మచ్చలు కూడా తగ్గే వీలుంటుంది. రక్త ప్రసరణ పెరగడం వల్ల మీ ముఖంపై ఎలాంటి మొటిమలు, ఇతర చర్మ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.
చన్నీళ్లతో ముఖం కడుక్కోవడం : సాధారణంగా మనలో కొందరు రోజుకి ఐదారు సార్లు ముఖం కడుక్కుంటే ఇంకొందరు కేవలం స్నానం చేసేటప్పుడు మాత్రమే ముఖం కడుక్కుంటారు. కానీ ఈ రెండూ సరైనవి కావు. ముఖానికి ఎక్కువ సార్లు సబ్బు పెట్టుకోవడం వల్ల చర్మం పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే రోజూ కనీసం రెండు సార్లు సబ్బుతో ముఖం కడుక్కోవాలి. ఇంకా మధ్యలో కడుక్కోవాలనుకుంటే కేవలం నీటిని మాత్రమే ఉపయోగించాలి. చన్నీటితో అప్పుడప్పుడూ ముఖాన్ని కడుక్కుంటూ ఉండడం వల్ల చర్మానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ముఖ చర్మాన్ని బిగుతుగా, మెరిసేలా చేస్తుంది. పప్ఫీనెస్ వంటివి ఉంటే దాన్ని కూడా తగ్గిస్తుంది.
ఐస్ ప్యాక్ కూడా.. : చర్మానికి రక్త ప్రసరణ పెంచేందుకు.. ముఖం ఉబ్బినట్లుగా కనిపిస్తుంటే ఆ పప్ఫీనెస్ తగ్గించేందుకు ఐస్ కూడా పనిచేస్తుంది. మొటిమలను తగ్గించేందుకు కూడా ఇది మంచి పద్ధతి. దీనికోసం ఫ్రీజర్ నుంచి ఐస్ క్యూబ్ తీసుకొని దాన్ని నేరుగా ముఖంపై పెట్టి రుద్దుకోవచ్చు. మీకు అలా రుద్దడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తే శుభ్రమైన కర్చిఫ్ లాంటిది తీసుకొని అందులో ఐస్ క్యూబ్ ని పెట్టి దానితోనూ రబ్ చేసుకోవచ్చు. అయితే ఇలా రోజూ చేయడం మంచిది కాదు.. కొంత గ్యాప్ ఇవ్వడం మంచిది.
వారానికోసారైనా మార్చండి..: చాలామంది తాము ఉపయోగించే బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ చాలా తక్కువగా ఉతుకుతుంటారు. కానీ రోజూ రాత్రి మనం వాటిపైనే కనీసం ఎనిమిది గంటల పాటు నిద్రపోతుంటాం. ఈ సమయంలో డెడ్ స్కిన్ మొత్తం వాటిపైనే చేరుకొని ఉంటుంది. దీంతో పాటు చర్మం నుంచి విడుదలయ్యే ఆయిల్స్, చుట్టుపక్కల ఉన్న దుమ్ము, బ్యాక్టీరియా వంటివి కూడా వాటి మీద చేరతాయి. ఇవి ఎన్నో రకాల చర్మ సమస్యలకు కారణమవుతాయి. అందుకే వీటిని వారానికోసారైనా మారుస్తూ ఉండాలి. ఒకవేళ మీకు మొటిమల వంటి సమస్యలు ఉంటే ఇంకా తరచుగా మార్చడం మంచిది.
వెనక్కి పడుకోండి : మీరు ఎలా పడుకుంటారు? పడుకునే విధానం కూడా చర్మ సమస్యలు రావడానికి కారణమేనట. మీరు తల పైకి ఉండేలా వెల్లకిలా పడుకుంటే చర్మ సమస్యలు వచ్చే ముప్పు చాలా తగ్గుతుందట. పక్కకి తిరిగి పడుకోవడం, బోర్లా పడుకోవడం వల్ల మీ చర్మానికి, పిల్లో కవర్ లేదా బెడ్ షీట్ కి మధ్య రాపిడి జరుగుతుంది కాబట్టి మీ చర్మంపై ముడతలు, సన్నని గీతలు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వీలైనంత వరకూ వెల్లకిలా పడుకోవడానికి ప్రయత్నించండి.
మేకప్ తొలగించండి : ఈ కాలంలో మేకప్ వేసుకోని వారు చాలా తక్కువ మంది. పౌడర్లు, ఫౌండేషన్లు వంటివి కాకపోయినా లిప్ స్టిక్, ఐ లైనర్ వంటివి కొందరు వాడుతుంటారు. అయితే మీ ముఖంపై ఎలాంటి ఉత్పత్తులు ఉపయోగించినా.. చివరకు ఫేస్ క్రీమ్ లేదా పౌడర్ వాడినా దాన్ని శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు. రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా మేకప్ శుభ్రం చేసుకొని ముఖాన్ని మంచి టాక్సిన్ ఫ్రీ క్లెన్సర్ సాయంతో కడుక్కోవాలి. దీనివల్ల కనీసం రాత్రి పూట అయినా చర్మ రంధ్రాలకు గాలి పీల్చుకునే అవకాశాన్ని అందించండి. దీనివల్ల చర్మం మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది.
చేతులు కడుక్కోండి : ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి భయపడి తరచూ చేతులు కడుక్కుంటున్నాం కానీ ఇది చాలా మంచి పద్ధతి అని నిపుణులు వెల్లడిస్తున్నారు. మనం చేతులతో వివిధ వస్తువులను పట్టుకుంటూ ఉంటాం. డోర్లు, కీ బోర్డ్, టేబుల్, మౌస్, ట్యాప్ వంటివన్నీ ముట్టుకుంటాం. వీటన్నింటికీ ఉన్న బ్యాక్టీరియా మన చేతులకు అంటుకుంటుంది. మనకు తెలియకుండానే మనం చాలాసార్లు చేతులతో ముఖాన్ని తాకుతుంటాం. దీనివల్ల ఆ బ్యాక్టీరియా ముఖంపైకి చేరుతుంది. అందుకే అప్పుడప్పుడూ చేతులు కడుక్కుంటూ ఉండాలి.
యోగా, మెడిటేషన్ : కొన్ని రకాల యోగా పోజుల వల్ల మన ముఖానికి రక్త ప్రసరణ ఎక్కువగా జరుగుతుంది. ఫేస్ యోగా చేయడం ద్వారా మంచి ఫలితాలు కనిపిస్తాయని యోగా నిపుణులు చెబుతున్నారు. అందుకే కనీసం రోజుకు ఐదు నిమిషాల పాటైనా యోగా చేయడం మంచిది. దీనివల్ల చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. అలాగే ఒత్తిడి తగ్గించుకోవడం వల్ల కూడా చర్మంపై ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. ఒత్తిడి ని తగ్గించేందుకు మెడిటేషన్ చేయడం మీకోసం కొంత సమయాన్ని కేటాయించుకొని రిలాక్స్ అవ్వడం వంటివి చేస్తుంటే చర్మం కూడా మెరుస్తూ కనిపిస్తుంది.