చర్మ సౌందర్యాన్ని కాపాడే బెస్ట్ ఫ్రూట్‌గా బొప్పాయికి పేరుంది. చర్మ సంరక్షణ కోసం పూర్వం నుంచి దీన్ని వాడుతున్నారు. బాగా పండిన బొప్పాయి పండు గుజ్జును శరీరానికి రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. పై పూత లాగానే కాకుండా బొప్పాయిని ఆహారంలో తీసుకోవడం కూడా చాలా మంచిది. (Image Credit : Shutterstock)
మార్కెట్లో దొరికే రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌లో బొప్పాయి పండు గుజ్జును కలుపుతారు. అధునాతన ఉత్పత్తుల కంటే కూడా ఒక్కోసారి సహజమైన పద్ధతులను అనుసరించడం మంచిది. చాలా మంది చర్మాన్ని తాజాగా కాంతివంతంగా ఉంచుకోవడానికి ఇప్పుడు నేచురల్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగానే అనేక రకాల పండ్లను స్కిన్ కేర్ రొటీన్లో వాడుతున్నారు. అయితే వీటన్నింట్లో బొప్పాయితో ప్రయోజనాలు ఎక్కువ అంటున్నారు నిపుణులు.
* రోజువారీ ఆహారంలో.. : బొప్పాయి పండులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో విటమిన్ A, C, E, K, జింక్, క్యాల్షియం ఉంటాయి. రోజూ కొన్ని బొప్పాయి ముక్కలను స్నాక్స్‌లా తీసుకుంటే, చర్మం కాంతివంతంగా మారుతుంది. మొటిమలతో బాధపడుతున్న వారు బొప్పాయి తినడం మంచింది. దీనిని ఆహారంలో తీసుకోవడంతో పాటు నేచురల్ ఫేషియల్‌గా కూడా వాడుకోవచ్చు.
* డెడ్ స్కిన్‌కు చెక్ : బొప్పాయి గొప్ప ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్. ఇందులో ఉండే పెపైన్ అనే ఎంజైమ్, చర్మం నుంచి మృతకణాలను తొలగిస్తుంది. ఇలా మృతకణాలు తొలగిస్తే చర్మం వెంటనే కొత్త కణాలను పునరుద్ధరిస్తుంటుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వృద్ధాప్య ముడతలు రాకుండా బొప్పాయి సహకరిస్తుంది. చర్మం నిస్తేజం కాకుండా కాపాడుతుంది. అలాగే ఇందులోని విటమిన్ సీ, చర్మం ప్రకాశవంతంగా మారడానికి, మచ్చలను తగ్గించడానికి సహకరిస్తుంది.
* ఫేషియల్‌గా.. : బొప్పాయితో చాలా రకాల ఫేషియల్స్ కూడా చేసుకోవచ్చు. మెత్తగా పండిన బొప్పాయి గుజ్జుతో ముఖంపై సున్నితంగా చేతివేళ్లతో కాసేపు మర్దన చేసుకోండి. తర్వాత కడిగేయండి. దీని వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. అలాగే బొప్పాయి గుజ్జులో కాస్త పంచదార కలిపి ముఖానికి మర్దన చేసుకోవాలి. ఇది స్క్రబ్‌లా పనిచేసి మృతకణాలను తొలగిస్తుంది. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తుంటే ఎండ కారణంగా ట్యాన్ అయిన ఫేస్ కాంతివంతంగా మారుతుంది.