దాదాపు సంవత్సరం నుంచి కరోనా మహమ్మారి వల్ల అన్ని రకాలుగా మనం ప్రభావితం అవుతూనే ఉన్నాం. దీనివల్ల చాలా రోజుల పాటు జిమ్ లు, ఇతర సంస్థలు మూతబడ్డాయి. తెరిచినా కానీ జిమ్ లలో మాస్కులు ధరించి వ్యాయామం చేయడం ఇబ్బంది కలిగిస్తుందన్న ఉద్దేశంతో చాలామంది జిమ్ కి వెళ్లడం మానేశారు. అయితే జిమ్ కి వెళ్లనంత మాత్రాన వ్యాయామం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు.
ప్లాంక్ పుషప్స్ : దీనికోసం మీ శరీరాన్ని ముందు ప్లాంక్ పొజిషన్ లోకి తీసుకురావాలి. అంటే కింద బోర్లా పడుకొని చేతులు, కాలి వేళ్లపై మీ బరువు ఉండేలా చూసుకోవాలి. అరచేతులు కింద పెట్టి శరీరం బరువు దానిపై ఉండేలా చూసుకోవాలి. మీ పొట్టపై ఒత్తిడి పడితే మీరు సరైన పొజిషన్ లో ఉన్నట్లు లెక్క. మీరు ఎంత సేపు చేయగలుగుతారో అంతసేపు దాన్ని కొనసాగించండి. ఒక్కో చేతిపై భారం వేస్తూ మరో చేతిని వీపుపై పెడుతూ దీన్ని చేస్తుండాలి.
లంజెస్ : ఈ వ్యాయామం చేయడం చాలా సులభం. మీ కాళ్లను భుజాల అంత వెడల్పుతో దూరంగా ఉంచి నిటారుగా నిలబడాలి. ఆ తర్వాత ఒక కాలిని ముందుకు జరపాలి. ఆ కాలిని మోకాలు దగ్గర వంటి 90 డిగ్రీల కోణంలో ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడు మరో కాలిని పూర్తిగా నేలపై ఆనించకుండా కేవలం వేళ్లు మాత్రమే నేలపై ఆనేలా వంచాలి. నడుము నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం అలవాటయ్యాక చేతుల్లో నీళ్ల బాటిల్స్ పట్టుకొని చేయడం వల్ల కష్టంగా మార్చుకుంటూ పోవచ్చు.
స్టెపప్ : ప్రతి ఇంట్లోనూ మెట్లు ఉంటాయి. మరీ ఎత్తుగా కాకుండా కాస్త ఎత్తుగా ఉండే మెట్టును ఎంచుకోవాలి. ముందు ఎడమ కాలిని ఆ మెట్టుపై పెట్టి బరువంతా ఆ కాలిపై ఉంచి మరో కాలిని గాలిలో ఉంచాలి. ఆ తర్వాత ఇంకో కాలిని కూడా ఈ మెట్టుపై ఉంచి ఎడమ కాలిని కిందకి దింపాలి. ఇప్పుడు ఇదే పద్దతిని మరో కాలితో కూడా కొనసాగించాలి. ఇలా ఒక్కో కాలితో పది నుంచి పదిహేను సార్లు చేయాలి.