యాపిల్ (Apple Seeds):మనలో చాలా మందికి యాపిల్ పండు అంటే ఇష్టం. రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లే అవసరమే ఉండదని చెబుతారు. ఆరోగ్యానికి అంత మంచిది. కానీ యాపిల్ గింజలు మాత్రం చాలా డేంజర్. ఒక్కోసారి మనకు తెలియకుండానే గింజలను మింగేస్తుంటాం. ఒకటో రెండో తింటే ఏం కాదు. కానీ పెద్ద మొత్తంలో యాపిల్ గింజలు తింటే మాత్రం.. చాలా ప్రమాదకరం. ఇందులో సైనైడ్ ఉంటుంది. అధిక మోతాదులో తీసుకుంటే ఉదర సమస్ుయలు, వికారం, విరేచనాలు వస్తాయి. మరణానికి కూడా సంభవించవచ్చు.
చెర్రీ (Cherry Seeds): చెర్రీ చూసేందుకు ఎర్రగా, చాలా అందంగా ఉంటుంది. తింటే కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది. ఐతే దాని విత్తనాలు మాత్రం ఆరోగ్యానికి అంతే హానికరం. చెర్రీ గింజల్లో సైనైడ్ సమ్మేళనం ఉంటుంది. దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కడుపులో తిమ్మిర్లు, విరేచనాలు, వికారం వంటివి వస్తాయి. యాపిల్ గింజల మాదిరిగానే.. వీటిని అధిక పరిమాణంలో తింటే మరణం సంభవించవచ్చు.
పీచు (Peach Seeds): పీచు గింజలకు కూడా వీలైనంత దూరంగా ఉండాలి. ఇవి అమిగ్డాలిన్, సైనోజెనిక్ గ్లైకోసైడ్లను కలిగి ఉంటాయి. ఈ గింజలను తీసుకుంటే మనుసులో ఊహించని భయంతో పాటు కడుపునొప్పి, శారీరక బలహీనత వంటి సమస్యలు వస్తాయి. ఒక్కోసారి కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదముంది. అందుకే పొరపాటున కూడా పీచు గింజలను తినకూడదు.
ఆప్రికోట్ (Apricot Seeds): ఆప్రికోట్ గింజలు ఆరోగ్యానికి విషం లాంటివి. ఈ విత్తనాలలో సైనోజెనిక్ గ్లైకోసైడ్స్, అమిగ్డాలన్స్ అనే టాక్సిన్స్ ఉంటాయి. వీటిని ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల పీచు గింజల మాదిరిగానే సమస్య వస్తుంది. శరీరం బలహీనపడుతుంది. ఆందోళన పెరుగుతోంది. ఈ విత్తనాలను ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే.. కోమాలోకి వెళ్లే ప్రమాదముంది.
పియర్ (Pear Seeds): పియర్ పండ్ల గింజలు కూడా ఆరోగ్యానికి ప్రమాదకరం. ఈ విత్తనాలలో ప్రాణాంతకమైన సైనైడ్ పదార్థం ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, వికారం, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. దీన్ని ఎక్కువ మోతాదులో తినడం వల్ల విపరీతమైన చెమటలు పట్టడం, అలసట, కడుపులో తిమ్మిర్లు రావడం మొదలవుతాయి. ఒక్కోసారి కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది.