ఎలాంటి విత్తనాలు నాటుతారో, అలాంటి పంటే పండిస్తారు అనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీవితం కోసం సరిగ్గా అన్వయించుకోవచ్చు. జీవితం ప్రారంభంలో తక్కువగా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. వయసు పెరిగే కొద్దీ అనారోగ్యాలు చుట్టుముడతాయి. 30 ఏళ్ల వయసులో చాలా మంది ఆరోగ్యంగా ఉంటారు. గుండె పనితీరు బాగుంటుంది.
అయితే 30 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం.. ముందు నుంచి సరైన అలవాట్లు, జాగ్రత్తలు తప్పనిసరి. భవిష్యత్తులో ఆరోగ్య ప్రయోజనాలను పొందేందుకు ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను బెంగళూరు రిచ్మండ్ రోడ్ ఫోర్టిస్ హాస్పిటల్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ డైరెక్టర్ డాక్టర్ రాజ్‌పాల్ సింగ్ వివరించారు. అవేంటో పరిశీలించండి. (Dr Rajpal Singh, Director, Interventional Cardiology, Fortis Hospital, Richmond Road, Bengaluru)
* క్రమం తప్పకుండా వ్యాయామం : రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ లెవల్స్ వంటివి గుండె సంబంధిత వ్యాధుల ముప్పును పెంచుతాయి. రోజూ వ్యాయామం చేయడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. క్రీడలు, స్విమ్మింగ్, లేదా సాధారణ వ్యాయామం, 40 నిమిషాల పాటు నడక వంటివి అలవాటు చేసుకోవాలి. రోజూ 40 నిమిషాలు లేదా వారానికి కనీసం 5 సార్లు అయినా వ్యాయామం చేయాలి.
* సెన్సిబుల్ డైట్ : ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కార్బోహైడ్రేట్స్, కొవ్వు తక్కువగా తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, రోజుకు 5 రకాల పండ్ల ముక్కలు, తక్కువగా ఉప్పు, మంచి హైడ్రేషన్, మితంగా ఆల్కహాల్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అతిగా తినడం కంటే రోజులో ఎక్కువ సార్లు తినడం మంచిది.
* హెల్త్ చెకప్ : చికిత్స కంటే నివారణ ఉత్తమం. 30 ఏళ్ల తర్వాత, కనీసం సంవత్సరానికి ఒకసారి సాధారణ గుండె, ఆరోగ్య పరీక్ష చేయించుకోవాలి. ధూమపానం చేసేవారు, మధుమేహం, హైపర్టెన్సివ్, ఊబకాయం ఉన్నవారు, అకాల గుండె జబ్బుల కుటుంబ చరిత్ర ఉన్నవారు, అధిక కార్డియాక్ రిస్క్ ప్రొఫైల్ ఉన్నవారు కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాలి. ఈ జాగ్రత్తలతో పాటు మంచి నిద్ర, పాజిటివ్ ఆలోచనలతో ఉంటే 30 సంవత్సరాల తర్వాత కూడా గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.