జనవరి 1 వచ్చిందంటే చాలు అందరిలోనూ న్యూ ఇయర్ జోష్ కనిపిస్తుంది. ఈ తేదీన ఎక్కడ చూసినా ఆహ్లాదకరమైన వాతావరణమే నెలకొంటుంది. హంగులు, ఆర్భాటాలతో ప్రపంచం రంగులమయం అవుతుంది. క్యాలెండర్లో ఏ రోజుకి లేని ప్రత్యేకత ఒక్క జనవరి 1కే ఉంటుంది. దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఈ రోజుని న్యూ ఇయర్ గా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. అయితే కొత్త సంవత్సరాన్ని జనవరి 1నే ఎందుకు జరుపుకుంటారు? ఎప్పటి నుంచి జనవరి 1ని కొత్త సంవత్సరంగా జరుపుకుంటున్నారు? గతంలో కొత్త సంవత్సరం ఏ తేదీన జరుపుకున్నారు? లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
రోమన్ రిపబ్లిక్ క్యాలెండర్ కీలకపాత్ర .. నుమా పాంపిలస్ అనే రాజు క్రీస్తుపూర్వం 715 - 673 సంవత్సరాల వరకు రోమన్ ని పరిపాలించాడు. తన పరిపాలన సమయంలో ఆయన రోమన్ రిపబ్లికన్ క్యాలెండర్‌ను సవరించాడు. అప్పట్లో మార్చి నెల సంవత్సరంలో మొదటి నెలగా ఉండేది. అయితే పాంపిలస్ రాజు మార్చి స్థానంలో జనవరిని సంవత్సరంలో మొదటి నెలగా మార్చాలని నిర్ణయించుకున్నాడు. (ప్రతీకాత్మక చిత్రం)
ఎందుకంటే రోమన్ పురాణాలలో అన్ని ప్రారంభాల దేవుడు అయిన జానస్ పేరును జనవరికి నామకరణం చేయడం జరిగింది. అందువల్ల సంవత్సరాన్ని కూడా జనవరి నెలతో ప్రారంభించాలని ఆయన భావించాడు. అయితే యుద్ధ దేవుడు అయిన మార్స్ నుంచి మార్చి అనే పేరు వచ్చింది. అయితే ఈ రెండు నెలలను పాంపిలస్ రాజు మార్చి జనవరి 1ని సంవత్సరాది చేశాడని చరిత్రకారులు నమ్ముతుంటారు. కానీ క్రీస్తుపూర్వం 153 ఏడాది వరకు జనవరి 1 అనేది సంవత్సరానికి మొదటి రోజు అని లాంఛనం కాలేదని ఆధారాలు సూచిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
కొత్త మార్పులతో జూలియన్ క్యాలెండర్.. క్రీస్తు పూర్వం 46లో జులియస్ సీజర్ రోమన్ రిపబ్లిక్ క్యాలెండర్లో కొన్ని సవరణలు చేసి జూలియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు. ఈ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో 365 రోజులు ఉంటే.. మొదటి రోజు జనవరి 1గా ఉండేది. ఆ విధంగా అది న్యూ ఇయర్ కు తొలిరోజు అయ్యింది. క్రీస్తుపూర్వం 46లో జనవరి 1వ తేదీని కొత్త సంవత్సరంగా జరుపుకునేవారు. తర్వాత సంవత్సరాదిని జనవరి ఒకటో తేదీ కాకుండా వేరే తేదీలకు క్రైస్తవ దేశాలు మార్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)
రోమ్ పతనం తర్వాత క్యాలెండర్‌ను మార్చిన క్రైస్తవ దేశాలు.. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో రోమ్ పతనం తర్వాత అనేక క్రైస్తవ దేశాలు జూలియన్ క్యాలెండర్‌ను మార్చేశాయి. క్రైస్తవ మతాన్ని ఎక్కువగా ప్రతిబింబించేలా క్యాలెండర్‌ను మార్చడం జరిగింది. కొత్త సంవత్సరాది మార్చి 25వ తేదీ కావాలని ఈ దేశాలు భావించాయి. ఎందుకంటే మార్చి 25న దేవదూత గాబ్రియెల్ మేరీ అనే కన్యకు కనిపించి "నీ కడుపున జీసస్/యేసుక్రీస్తు పుట్టబోతున్నాడ"ని చెప్పారు. అలాగే క్రిస్మస్ రోజు అయిన డిసెంబర్ 25ను కొత్త సంవత్సరాదిగా మార్చారు. జనవరి ఒకటో తేదీన జరగాల్సిన న్యూ ఇయర్ మార్చి 25, డిసెంబర్ 25వ తేదీల్లో జరిగేవి. (ప్రతీకాత్మక చిత్రం)
జనవరి 1న నూతన సంవత్సర దినంగా పునరుద్ధరించిన గ్రెగోరియన్ క్యాలెండర్.. భూమి సూర్యుడిని ఒక్కసారి చుట్టడానికి 365.25 రోజుల సమయం పడుతుంది. కానీ జూలియన్ క్యాలెండర్ 365 రోజులు మాత్రమే కలిగి ఉంది. దీనివల్ల ఏడాదికి దాదాపు ఆరు గంటలు సమయం మిగిలిపోతుంది. ఫలితంగా తేదీల్లో తప్పులు వస్తున్నాయి. అయితే మిగిలిపోతున్న సమయం నాలుగేళ్లకయితే 24 గంటలు అని పోప్ గ్రెగొరీ XIII లెక్కగట్టారు. అలా ఆ ఒకరోజును నాలుగేళ్లకోసారి కలుపుతూ లీప్ సంవత్సరమని దానికి పేరు పెట్టారు. (ప్రతీకాత్మక చిత్రం)
తరువాత పోప్ గ్రెగొరీ XIII 1582లో సవరించిన క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు. దీన్ని గ్రెగోరియన్ క్యాలెండర్‌గా పిలిచేవారు. ఈ క్యాలెండర్‌తో జనవరి 1ని నూతన సంవత్సరం ప్రారంభంగా పోప్ గ్రెగొరీ పునరుద్ధరించాడు. ఈ కొత్త క్యాలెండర్‌ను ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ క్యాలెండర్ కు ముందు మార్చి 25ని నూతన సంవత్సరంగా జరుపుకునే. ఐతే గ్రెగోరియన్ వచ్చిన సమయం నుంచి జనవరి ఒకటో తేదీని నూతన సంవత్సరం గా జరుపుకుంటున్నారు. భారతదేశంలో పలు రాష్ట్రాల్లో రకరకాల తేదీల్లో కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. మన తెలుగువారి ఉగాదిని సంవత్సరాదిగా జరుపుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)