పని ఒత్తిడిలో శరీరానికి అవసరమైన మేర నీరు తాగకపోవడం ప్రధాన కారణమని డాక్టర్లు చెబుతున్నారు. మనిషి ప్రతి రోజూ ఎంత నీరు తీసుకోవాలో కూడా చాలా మందికి తెలియకపోవడం వల్ల కిడ్నీల్లో రాళ్ల సమస్యను ఎందుర్కొంటున్నారు. శరీరంలో మలినాలను శుద్ధి చేసేందుకు అవసరమైన మేర మంచి నీరు తాగాలి అలా సరైన సమయంలో నీరు తాగకుంటే కిడ్నీలు ఒత్తిడికి లోనవుతాయి.
మలినాలను విసర్జించడంలో ఫెయిల్ అవుతాయి. అందుకే కిడ్నిల్లో రాళ్లు చేరకుండా ఉండాలంటే ఏం చేయాలి. అసలు కిడ్నీల్లో రాళ్లు వస్తే లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. శరీరంలో ఉన్న ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు. వాటికి ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే.. శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి.. మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి.
వాటి పనితీరులో చిన్న అవాంతరం ఏర్పడినా సమస్యలు తప్పవు. ఎంతో సున్నితంగా ఉండే కిడ్నీలను ఎలా కాపాడు కోవాలో చూద్దాం. నీరు తక్కువగా తాగేవారి కిడ్నీల్లో త్వరగా రాళ్లు ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు డాక్టర్లు. ఈ రాళ్లు రకరకాల పరిమాణంలో ఉంటాయి. రాళ్లు అంటే మనకు బయట కనిపించే రాళ్లుమాత్రంకాదు. లవణాలు, ఖనిజాలు, కాల్షియం, యూరిక్ ఆమ్లాలు మూత్రపిండాల్లో చేరి కఠినమైన పదార్థంగా అంటే రాళ్లుగా రూపాంతరం చెందుతాయి.
వీటినే కిడ్నీ స్టోన్స్ అంటారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడితే మూత్రవిసర్జనలో సమస్యలు ఏర్పడతాయి. చిన్న రాళ్లు మూత్రం నుంచి వెళ్లేప్పుడు పెద్దగా సమస్య ఉండదు. కానీ పెద్ద రాళ్లు బయటకు వెళ్లేప్పుడే తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది. వ్యాధి లక్షణాలుతరచుగా నడుము పక్కన లేదా వెనుక భాగంలో నొప్పి వస్తుంటే కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు అనుమానించాలి.
ఇక మూత్రం పోస్తున్నప్పుడు నొప్పిగా ఉన్నా, మండుతున్నట్లు అనిపించినా కిడ్నీలో రాళ్లు ఏర్పడుతున్నట్లు గుర్తించాలి. మూత్రం నుంచి రక్తం కారుతుంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. తీవ్రమైన అనారోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. వేగంగా మూత్రం వస్తున్నట్లు అనిపిస్తున్నా సరే, అది కిడ్నీలో రాళ్లకు సంకేతమని భావించాలి.మూత్రం చిక్కగా, దుర్వాసనతో వస్తున్నా కిడ్నీలో రాళ్ల సమస్యగా అనుమానించాలి.
మూత్రం చుక్కచుక్కలుగా వస్తున్నా కిడ్నీ స్టోన్స్‌గా అనుమానించాలి. తరచూ జ్వరం, పొత్తి కడుపు నొప్పి, వికారం, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాల్లో ఏవి కనిపించినా కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్టు అనుమానించాలి. డాక్టర్ వద్దకెళ్లి పరీక్షలు చేయించుకోవాలి.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)