మహిళల్లో క్యాన్సర్ ముప్పు పెరగడానికి కారణాలు, ఎదురవుతున్న ఇబ్బందులు, చికిత్స, వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సి జాగ్రత్తల గురించి బెంగళూరులోని ఆస్టర్ సీఎంఐ హాస్పిటల్, రేడియేషన్ టెక్నాలజీ విభాగం డాక్టర్ పుష్ప నాగ సీహెచ్ కొన్ని సూచనలు చేస్తున్నారు. (Dr. Pushpa Naga C H, Department of Radiation Oncology, Aster CMI Hospital, Bengaluru)
* క్యాన్సర్ లక్షణాలు : కొన్ని లక్షణాలు లేదా సంకేతాల ద్వారా మహిళల్లో ముందుగానే క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. అనంతరం వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి వాటిని నిర్ధారించుకోవచ్చు. శరీరంలో ఎక్కడైనా అసాధారణంగా వాపు లేదా గడ్డ ఉండటం, రొమ్ములో మార్పులు, యోని దగ్గర మచ్చలు, రక్తస్రావం, స్కిన్ అలెర్జీ, దీర్ఘకాలికంగా నయం కాని పుండు, దగ్గు, గొంతులో ఇబ్బంది, బొంగురుపోవడం, ఏదైనా తినేటప్పుడు, తాగేటప్పుడు ఇబ్బంది పడటం ఉంటాయి. హఠాత్తుగా బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం మంచిది.
వ్యక్తిగత లేదా కుటుంబ చరిత్ర, ఊబకాయం, ఆల్కహాల్, సిగరెట్ వినియోగం, వేయించిన ఆహారం తినడం, రుతుక్రమంలో లోపాలు, మోనోపాజ్, చిన్న వయసులో ఎక్కువమందితో లైంగికంగా పాల్గొనడం, తక్కువ రోగనిరోధక శక్తి, రేడియేషన్ ప్రభావం, హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ (HIV), హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV), హెపటైటిస్ వైరస్లు, హెలికోబాక్టర్ పైలోరీ వంటివి క్యాన్సర్ కేసుల్లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మందిలో రావడానికి కారణాలు కావచ్చు.
* అవసరమైన టెస్టులు : ముందుగానే వ్యాధిని గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా మరణం ముప్పు నుంచి తప్పించుకోవడంతో పాటు వ్యాధి కూడా తగ్గుతుంది. అందుకు కొన్ని స్ర్కీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. దీని వల్ల 80% మంది మహిళలను ప్రాణాలతో కాపాడుకోవచ్చు. 40 ఏళ్ల వారు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వాళ్లు ఏడాదికోసారి ఈ పరీక్షలు చేయించుకోవడం మంచిది.
మమ్మోగ్రఫీ, గర్భాశయ పాప్-స్మెర్ పరీక్ష, ఓవరీస్, యుటెరస్ నింగ్, కాల్పోస్కోపీ/ సిగ్మాయిడోస్కోపీ, క్లినికల్ ఓరల్ టెస్ట్, మల లేదా రక్త పరీక్షలు చేయించుకోవడం అవసరం. సీఏ -125 (అండాశయ క్యాన్సర్), సీఈఏ (పెద్దప్రేగు క్యాన్సర్), ఏఎఫ్‌పీ (లివర్ ట్యూమర్ల) వంటి స్ర్కీనింగ్‌లు ముందుగానే వ్యాధిని గుర్తించడంలో సహాయపడతాయి. BRCA 1 & 2, TP53, PTEN, ATM మ్యుటేషన్ పరీక్షలు వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్ ప్రమాదాన్ని అంచనా వేయడానికి సహాయపడతాయి.
* చికిత్సతో పెరగనున్న జీవితకాలం : త్వరగా గుర్తించి చికిత్స చేయడం ద్వారా రోగికి పూర్తిగా నయం చేయవచ్చు. లేదంటే ఎక్కువ కాలం బతికేలా చేయవచ్చు. క్యాన్సర్ వచ్చిన ప్రతి మహిళకు నిర్ధారణ, చికిత్స ఒకేలా ఉండకపోవచ్చు. శరీర స్థితి బట్టి మారొచ్చు. ఆపరేషన్ చేసి క్యాన్సర్ కణితి తొలగించడం, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, హార్మోన్ థెరపీ, ఇమ్యునోథెరపీ, మల్టీమోడాలిటీ విధానాల్లో వివిధ దశల్లో చికిత్స చేస్తారు. శరీరంలోని వివిధ అవయవాలకు వ్యాపిస్తే అధునాతన టెక్నాలజీతో చికిత్స అందిస్తారు.
* కొంతమందికి సిఫార్సు : స్త్రీలలో గర్భాశయ, యోని, వల్వల్ క్యాన్సర్ వంటి HPV-సంబంధిత క్యాన్సర్లను నివారించడానికి, HPV, Cervarix™/ Gardasil™ నిరోధక టీకాలు ఉపయోగిస్తారు. 45 ఏళ్లు దాటిన మహిళలు అందరికీ ఈ టీకాలు అందుబాటులో ఉన్నాయి. 9-15 సంవత్సరాల వయస్సులో ఉన్న వారికి వైద్యుల సూచనల మేరకు మాత్రమే వీటిని వినియోగించాలి.
* పాటించాల్సిన జాగ్రత్తలు : ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా వ్యాధి నుంచి కోలుకోవచ్చు. లేదా క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని డాక్టర్ పుష్ప నాగ సీహెచ్ చెబుతున్నారు. ఇందుకు శారీరక శ్రమ అవసరం. రోజూ వ్యాయామం, యోగా, వాకింగ్ వంటివి చేస్తూ ఉండాలి. సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ వంటివాటికి దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. వేయించిన ఆహారం, మాంసాన్ని తగ్గించాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.