బరువు తగ్గడం అనేది మన రోజు వారీ జీవితంలో కీలక అంశం. తగ్గకపోతే.. అనారోగ్యాలు తప్పవు కాబట్టి.. ఎత్తుకి తగిన బరువు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. అందుకోసం లైఫ్స్టైల్లో మార్పులు చేసుకోవాలి. మంచి ఆహారం తినాలి, అదే సమయంలో కొవ్వు ఏర్పడనిది తినాలి. ఖరీదైన ఆహారం తింటే మంచిది అని కొందరు అనుకుంటారు. అది తప్పుడు అభిప్రాయం. ఖరీదైనదా, కాదా అన్నది మ్యాటర్ కాదు.. తినే ఆహారం వెంటనే పూర్తిగా జీర్ణం అయ్యేది అయి ఉండాలి. అలాంటిది తింటే బరువు పెరగం.
ఇవి తగ్గించాలి : నెయ్యి, డాల్డా, వెన్న, ఆయిల్ ఫుడ్, ఫ్రై ఫుడ్, స్ట్రీట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఐస్‌క్రీమ్స్, స్వీట్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, కుకీస్, పుడ్డింగ్స్, మద్యం.. ఈ ఆహారం కచ్చితంగా తగ్గించుకోవాలి. ఆ ఉద్దేశం లేకపోతే మాత్రం ఈ స్టోరీ చదవడం వేస్ట్. ఇవి తగ్గించుకోకపోతే... బరువు తగ్గరు, పెరుగుతారు.
నీరు తాగండి : తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వాలి. అప్పుడే బాడీలో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. గ్రైండర్లో పప్పు వేసినప్పుడు.. అప్పుడప్పుడూ నీరు పోస్తాం కదా.. తద్వారా పప్పు బాగా నలిగి.. రుబ్బు బాగా వస్తుంది. అలాగే మనం ఆహారం తిన్న తర్వాత కూడా అరగంటకో 100 గ్రాముల నీరు తాగాలి. అలా రెండున్నర గంటలపాటూ తాగాలి. తద్వారా ఆహారం బాగా జీర్ణం అవుతుంది. కొవ్వు నిల్వలు ఏర్పడవు. కిడ్నీలు కూడా దెబ్బతినవు.
ఇవి ఎక్కువ తినవద్దు : మీరు బరువు తగ్గాలంటే.. సూపర్ మార్కెట్లకు వెళ్లడం తగ్గించాలి. ఎందుకంటే సూపర్ మార్కెట్లలో ప్రాసెస్ చేసిన రెడీ టూ ఈట్ ఫుడ్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే బ్రెడ్, పాస్తా, నూడుల్స్, పరాఠాల వంటివి. వీటిలో మైదా ఎక్కువగా ఉంటుంది. మైదా వల్లే కొలెస్ట్రాల్ పెరిగి... హార్ట్ ఎటాక్స్ ఎక్కువవుతున్నాయి. సూపర్ మార్కెట్లలో లభించే ఆహారాల్లో ఎక్కువ శాతం.. మన బాడీలో షుగర్ లెవెల్స్ పెంచేవే ఉంటున్నాయి. వాటి బదులు తృణధాన్యాలు, ఫైబర్ ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోండి.
ప్రోటీన్ కావాలి : ప్రోటీన్ అంటే మాంసకృత్తులు. ఇవి మాంసం, చికెన్, చేపలు, గుడ్లు, బీన్స్, పప్పులు, గింజలు, నట్స్‌లో బాగా ఉంటాయి. కందిపప్పులో ప్రోటీన్ చాలా ఎక్కువ. ఇలాంటి ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే.. ప్రోటీన్ ఆహారం కడుపు నిండిన ఫీల్ కలిగిస్తుంది. ఇది త్వరగా అరగదు. కాబట్టి.. త్వరగా ఆకలి వెయ్యదు. ఫలితంగా స్నాక్స్ తినే అలవాటు తగ్గుతుంది. తద్వారా అధిక బరువు పెరగరు.
కదలండి : ఈ రోజుల్లో చాలా మందికి శారీరక శ్రమ ఉండట్లేదు. కదలకుండా గంటల తరబడి ఒక చోట ఉండిపోతున్నారు. అందువల్ల కేలరీలు ఖర్చు అవ్వట్లేదు. బరువు పెరిగిపోతున్నారు. కనీసం ఓ గంట నడవాలి. లేదా ఒళ్లంతా కదిలేలా ఓ అరగంటైనా వేగవంతమైన వ్యాయామం చెయ్యాలి. మొత్తంగా శరీరానికి చెమట పట్టాలి. ఆ వేడికి బాడీలో కొవ్వు కరుగుతుంది. ఈ విషయం ఆల్రెడీ డాక్టర్లు మీకు చెప్పే ఉంటారు.
ఉపవాసం : మన పెద్దలు ఉపవాసం ఉండాలి అంటారు కదా.. అది చాలా మంచిది. సైంటిఫిక్‌గా కూడా రుజువైంది. అప్పుడప్పుడూ ఓ పూట ఉపవాసం ఉండాలి. అలా ఉన్నప్పుడు.. ఏమీ తినం కాబట్టి.. ఎనర్జీ కోసం శరీరం.. కొవ్వును వాడేసుకుంటుంది. అలా కొవ్వు కరిగిపోతుంది. రోజూ ఉపవాసం ఉండకూడదు. అలా ఉంటే.. లోబీపీ రాగలదు. అప్పుడప్పుడూ ఉండొచ్చు. దీనిపై మీ ఫ్యామిలీ డాక్టర్ సలహా తీసుకోండి.
బరువు తగ్గడం తేలిక కాదు. ఓపికతో ప్రయత్నించండి. మార్చి నుంచి జులై వరకూ ఎండలు ఉంటాయి. బరువు తగ్గడానికి ఇది సరైన టైమ్. ఈ టైంలో బరువు తగ్గి.. ఆ తర్వాత అదే వెయిట్‌ని మెయింటేన్ చేస్తూ ఉంటే.. ఇక మీకు అనారోగ్యాల సమస్యలు ఉండవు. బలంగా ప్రయత్నించండి. అవకాశం చేజార్చుకోవద్దు. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.)