ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు. చాలామందికి అధిక బరువు లేకపోయినా శరీరం అంతా మామూలుగానే ఉన్నా పొట్ట దగ్గర మాత్రం ఎక్కువ కొవ్వు పేరుకుపోతుంది. ఇలాంటి సమస్య మగవారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. బరువు తగ్గడానికి ప్రయత్నించేవారిలో కూడా శరీరంలోని మిగిలిన అన్ని భాగాల్లో ఉన్న కొవ్వు కరిగిన తర్వాతే పొట్ట దగ్గర ఉన్న కొవ్వు తగ్గుతుంది. ఇలా పొట్ట దగ్గర కొవ్వు చేరడానికి కారణం జన్యువులు అని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని కొన్ని లైఫ్ స్టైల్ మార్పుల ద్వారా తగ్గించుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అవేంటంటే..
- మీ రోజువారీ క్యాలరీల్లో సగం క్యాలరీలను మధ్యాహ్నం భోజనం సమయంలోనే తీసుకోండి. ఎందుకంటే ఈ సమయంలో మీ జీర్ణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం సమయంలో జీర్ణ శక్తి తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఈ సమయంలో వీలైనంత తక్కువ క్యాలరీల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు రాత్రి భోజనాన్ని ఏడు గంటల వరకే చేసేయడం మంచిది. దీనివల్ల నిద్ర కూడా హాయిగా పడుతుంది.
- శొంఠి పొడిలో థర్మోజెనిక్ ఏజెంట్లు ఉంటాయి. అవి శరీరంలోని కొవ్వు కరిగేందుకు తోడ్పడతాయి. అందుకే శొంఠి వేసి మరిగించిన నీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కూడా మెటబాలిజం వేగవంతం అవుతుంది. అధిక బరువుతో పాటు పొట్ట కూడా తగ్గుతుంది. కేవలం ఇలా తాగడం మాత్రమే కాదు.. దీన్ని రకరకాల ఆహార పదార్థాల్లోనూ భాగం చేసుకోవచ్చు.
- ఆహారం తినేటప్పుడు వేగంగా కాకుండా నెమ్మదిగా తినడం అలవాటు చేసుకోవాలి. ప్రతి ముద్దను బాగా నమిలి మింగాలి. కార్బొహైడ్రేట్ల జీర్ణ ప్రక్రియ నోటి నుంచే ప్రారంభమవుతుంది. ఇవి పూర్తిగా అరగాలంటే మన నోటిలోని లాలాజలం వాటితో కలవాలి. ఇలా చేయడం వల్ల నోట్లోనే ఆహారం మెత్తగా మారుతుంది. జీర్ణాశయంలో అది అరగడం సులువు అవుతుంది. ఇలా బాగా నమలడం వల్ల కడుపు నిండిన భావన కూడా తొందరగా వస్తుంది.