తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి కొంతమంది ఆయిల్ పెట్టి అతిగా హెయిర్ మసాజ్ చేస్తుంటారు. అయితే జుట్టుకు నూనె రాసిన తర్వాత మృదువుగా మర్దన చేయాలి. అంతేకానీ ఎక్కువగా మసాజ్ చేస్తే, కురులు దెబ్బతింటాయి. దీనివల్ల హెయిర్ ఫాలికల్స్ విరిగిపోయే అవకాశం ఉంది. సాధారణంగా జుట్టుకు నూనె రాసిన తర్వాత 5 నిమిషాల పాటు సున్నితంగా మర్దన చేస్తే సరిపోతుంది.
గడ్డకట్టిన నూనెలతో జుట్టుకు మర్దన చేయకూడదు. వర్షాకాలం లేదా శీతాకాలంలో హెయిర్ ఆయిల్స్ గడ్డకట్టి మందంగా తయారవుతాయి. వాటిని అలానే జుట్టుకు పట్టిస్తే కురులపై నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. గడ్డకట్టిన హెయిర్ ఆయిల్‌ను కాస్త వేడిచేసి జుట్టుకు రాసుకోవడం మంచిది. వెచ్చని నూనె తలపైకి, కురుల మొదళ్లలోకి బాగా చొచ్చుకుపోతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు తలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.