Stomach Pain : చాలాసార్లు స్కూల్ నుంచి ఇంటికి రాగానే పిల్లలు కడుపునొప్పిగా ఉంది అంటారు. అవాంటి సమయంలో గబగబా టాబ్లెట్ ఇచ్చేయవద్దు. ఇలా తరచూ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటే.. వారి కడుపులో సహజంగా ఉండే మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. దీని వల్ల కడుపు నొప్పి అనేది దీర్ఘకాలిక సమస్యగా మారగలదు. అందువల్ల బ్యాక్టీరియా చనిపోకుండా... కడుపు నొప్పిని తగ్గించడం ముఖ్యం. అందుకు ఆయుర్వేదంలో మంచి చిట్కా ఉంది.
మీరు వాము (ajwain) పేరు వినే ఉంటారు. ఇది చూడటానికి జీలకర్ర లేదా సోంపు లాగా ఉంటుంది. కానీ చాలా చిన్నగా ఉంటుంది. దీని వాసన ఘాటుగా ఉంటుంది. రుచి కొద్దిగా చేదుగా ఉంటుంది. చాలా షాపుల్లో వాము ప్యాకెట్స్ అమ్ముతారు. ఈ ప్యాకెట్ ఒకటి కొని ఇంట్లో సీసాలో ఉంచుకోవచ్చు. వాము త్వరగా పాడవదు. సంవత్సరమైనా పురుగు పట్టకుండా అలాగే ఉంటుంది. కాబట్టి.. కాస్త ఎక్కువే కొనుక్కోవచ్చు. కడుపు నొప్పికి వాము సరైన పరిష్కారం చూపిస్తుంది.
వామును చాలా ఆయుర్వేద మందుల్లో వాడుతారు. మన ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. కానీ చేదుగా ఉంటుందని పెద్దగా వాడరు. ఇప్పుడు మనం వాము గురించి తెలుసుకోవడం ద్వారా ఇకపై దాన్ని ఎక్కువగా వాడుకోవచ్చు. పిల్లలైనా, పెద్దవాళ్లైనా.. కడుపులో తేడాగా ఉన్నా, నొప్పిగా ఉన్నా, విరేచనాలు (diarrhea) అవుతున్నా వాము చిట్కాను పాటించడం మేలు.
ఇలా చెయ్యండి : ముందుగా 1 టీ స్పూన్ వామును దోరగా వేయించండి. అది చల్లారాక.. చేతిలోకి తీసుకొని.. చిటికెడు ఉప్పు కలిపి.. నోట్లో వేసుకొని.. గోరువెచ్చని నీరు తాగండి. నమలకుండానే వామును మింగేయవచ్చు. లేదా నీటిలోనే వాము, ఉప్పు వేసి.. తాగవచ్చు. దీని వల్ల వెంటనే ఫలితం కనిపిస్తుంది. కడుపు నొప్పి తగ్గిపోతుంది.