ఆనంద్ మోహన్, విశాఖపట్నం, న్యూస్ 18. ప్రపంచం 5 జీ స్పీడ్ తో పరిగెడుతోంది. సంప్రదాయాలు, ఆచారాలు అన్ని మారిపోతున్నాయి. అయినా ఇప్పటికే రాతియుగపు ఆచారాలు ఉన్న గ్రామం ఒకటి ఉందని మీకు తెలుసా..? వారి కట్టుబాట్లు.. ఆచారాలు విభిన్నం. విచిత్రమైన తమ అలవాట్లను విభిన్నమైన జీవన శైలిని కొనసాగిస్తున్న గిరిజనులు వారు. ఇదే తమ జీవితం అంటూ తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటున్నారు. వినూత్నంగా కనిపించే వీరిని బోండా గిరిజనులు అంటారు. ఇంకొంచెం స్టైలిష్ గా అయితే రీనోలుగా చెప్పవచ్చు.
ఒడిశా రాష్ట్రానికి చెందిన మల్కన్ గిరి జిల్లాలో ఈ ఆదివాసి గిరిజనులు ఎక్కువగా ఉంటారు. ప్రతి గురువారం ఒనకడిల్లీలో జరిగే సంతకు వచ్చి తమ దగ్గర ఉన్న కొండ చీపుర్లను, జీలుగ కల్లును అమ్ముకొని తమకు కావాల్సిన వస్తువులను కొనుక్కుంటారు. బోండా తెగకు, బోండా ప్రజలు నివాసం ఉండే గ్రామాల్లో పలు వినూత్న సంప్రదాయాలు ఉంటాయి. పదికి పైగా దాదాపు 10 వేల మంది జనాభా ఉన్న ఈ పెద్ద గ్రామం ప్రపంచంలోనే అత్యంత అరుదైన తెగగా అంత్రోపాలజిస్ట్ గుర్తించారు. బొండా అనేది వారి తెగ పేరు కాదు. రీనో గా చెబుతుంటారు. మాట్లాడే భాష ప్రకారం ఒడిశాలో అలా పేరొచ్చిందట.
ఆధునిక సమాజం ఆ తెగకు పెట్టిన పేరుగా మారిపోయింది. విచిత్రమైన వీరి వేషదారణ ఆచార అలవాట్లు ఆధునిక సమాజాన్ని అబ్బురపరుస్తాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ ఆదివాసి ప్రజలు ఫోటోలను దిగటానికి ఇష్ట పడరు. ఫోటో కాపీ రూపంలో తమ అత్మ నుంచి కొంత బాగం వెళ్లీ పొతుందని వీరి భావన. అయితే వీరు ఫోటోలు కావాలంటే ఓ ప్రత్యామ్నాయం ఉంది. టూరిస్టులు ఫోటోలు దిగమని అడిగితే డబ్బులు తీసుకుంటారు. ఆ డబ్బులతో సంతలో జీలుగ కల్లు కొని తాగుతారు. ఫొటో ద్వారా కోల్పోయిన తమ శక్తి ఇలా తిరిగి వస్తుందని వీరి నమ్మకం.
వీరి వస్ర్తధారణ విచిత్రంగా ఉంటుంది. మహిళలు యుక్త వయసకు రాగానే గుండు చెయించుకుంటారు.
ఆ గుండు కనిపించకుండా పూసల దండలను ఆభరణాలుగా అలంకరించుకుంటారు. ఒళ్లంతా పూసల దండలు ధరించి కేవలం నడుం వద్ద ‘‘రింగ్ డా’’అనే పట్టీను ధరిస్తారు. మెడ చుట్టూ అల్యుమినియం, వెండితో చేసిన రింగులను ధరిస్తారు. లోహంతో చేసిన గాజులను చేతుల నిండా వేసుకుంటారు. పూసలు ధరించడానికి కారణం అడిగతే రామాయణంతో ముడిపెట్టి చెబుతారు.
వనవాసం సమయంలో సీతాదేవీ బోండా ప్రజలు నివాసం ఉన్న ప్రాంతంలో నగ్నంగా ఒక సరస్సులో స్నానం చేస్తోందని.. ఆ సమయంలో అటుగా వెలుతున్న బోండా మహిళలు సీతాదేవిని చూసి నవ్వారని దానితో సీతా దేవీ ఆగ్రహంతో ఆ మహిళలు వస్త్రాలు ధరించకుండా ఉంటారని శాపం పెట్టిందని చెబుతారు. తరువాత మహిళలు సీతాదేవిని ప్రాధేయపడగా తన చీర నుంచీ కొనలో చిన్న వస్త్రం చించి ఆ మహిళలకు ఇచ్చిందని తమ కధ చెబుతారు. అప్పటి నుంచి ఆ తెగలోని మహిళలు అందరూ గుండు చేయించుకోవడంతో పాటుగా పూసలు తోనే ఒంటిని కప్పుకుంటారు.
బొండా (రీనో)లు కొండ ప్రాంతంలో ఎత్తైన ప్రదేశాలలో నివాసం ఉంటారు. సాధారణంగా గిరిజనులు నీరు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో నివాసం ఉంటారు. కానీ బోండా జాతీ ప్రజలు సాధారణ ప్రజలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు. రీనోలు కొండ శిఖరాగ్ర భాగంలో నివాసం ఉంటారు. తమ అవసరాల కోసం నీటిని తీసుకు వెళుతుంటారు. తమ గ్రామం చుట్టు రాళ్లు, కర్రలతో రక్షణ వలయం నిర్మించుకుంటారు. అక్కడ పహారా కాస్తారు. మహిళలు, పురుషులు ఇద్దరు ఆయుదాలు ధరిస్తారు. పహారా కాసే వారిలో ఎక్కువగా మహిళలే ఉంటారు. విల్లు బాణాలు పట్టుకుని.. కొత్త వ్యక్తులను గ్రామంలోనికి రానివ్వకుండా చూస్తుంటారు. వారికి పరిచయం ఉన్నవారితో వస్తేనే అనుమతిస్తారు. కొత్త వ్యక్తులు
వస్తే.. వారితో దుష్ట శక్తులను వెంటతీసుకు వస్తారని వీరి నమ్మకం.
పోడు వ్యవసాయం ప్రధాన వృత్తి. ఇక వీరి వివాహ వ్యవస్థ నవీన సమాజాన్ని ఆశ్చర్య పరిచేది ఉంటుంది. కుటుంబ పెద్ద కూడా మహిళే. మహిళాధిక్యం ఇక్కడ కనిపిస్తుంది. కుటుంబ భారం.. వ్యవసాయం, కాపాలలో భారం అంతా మహిళదే. తమ కంటే చిన్న వయస్సు ఉన్న యువకుడ్ని మాత్రమే పెళ్లాడుతారు ఇక్కడి యువతులు. తమ కంటే చిన్నవాళ్లను వివాహం చేసుకుంటే వృద్దాప్యంలో తమను బాగా చూసుకుంటారని నమ్ముతారు. అందుకే ఈ సంప్రదాయం. యువతులు తమ కన్న 7 నుంచి 9 సంవత్సరాల చిన్న వయస్సు యువకుల్నే పెళ్లి చేసుకుంటారు.
పెళ్లి తర్వాత కుటుంబాలతో కాకుండా విడివిడిగా ఉంటారు. అందుకు చిన్నచిన్న గుడారాలు ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ
అమ్మాయిల్ని ఆకట్టుకోవాల్సిన భారం యువకులదే. రకరకాల సంప్రదాయ వాయిద్య పరికరాలు ఉపయోగించి.. ఇంకెన్నోచేష్టలతో అబ్బాయే అమ్మాయికి ప్రపోజ్ చేయాలట. అమ్మాయికి ఆ అబ్బాయి నచ్చితే మాంసం వండి అబ్బాయికి పంపుతుంది. అబ్బాయి తరుపునుంచీ అమ్మాయి కుటుంబానికి కన్యాశుల్కం ఇచ్చే అనవాయితీ ఉంది. నచ్చిన వ్యక్తితో ఆమె అంగీకారంతో జీవించడం ప్రాధమిక ప్రమాణంగా భావిస్తారు. ఒకే గ్రామానికి చెందిన వారిని మాత్రం వివాహం చేసుకోవడం నిషేధం.
రీనో ఆదివాసి సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరు కష్టపడతారు. అయినప్పటికి కుటుంబ బాద్యత అంతా మహిళే నిర్వహిస్తుంది. వృద్దులు గ్రామంలో ఉన్న చిన్నారుల ఆలనాపాలన చూసుకుంటారు. ఇతరులు ఈ తెగను చూసి కాస్తంత భయపడతారు. పరిచయం లేని వారితో ఈ గ్రామస్తులు పెద్దగా మాట్లాడరు. స్త్రీ పురుషులు నిత్యం ఆయుదాలు పట్టుకొని సంచరిస్తారు.
జీలుగ కల్లు ఇప్పసారా లాంటివి స్త్రీ పురుషులు ఇద్దరు తీసుకుంటారు. క్షణికావేశంలో హత్యలు చెస్తారు. పైగా హత్యను పెద్ద తప్పుగా బావించరు..ఆ వ్యక్తిని చంపి అతనికి మేలు చెశామని బావిస్తారు.. చనిపోయిన వ్యక్తి ఆ గ్రామంలో తరువాత పుట్టేవారిగా భావిస్తారు. రెండేళ్ల నుంచీ కరోనా కారణంగా ఇక్కడ రాకపోకలు అట్టే లేవని చెబుతున్నారు. ఒడిశా ప్రభుత్వం వీరికి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.