ఇప్పుడంటే అన్ని షాపింగ్ మాళ్లు, ఫ్రూట్ స్టాళ్లలో యాపిల్స్ కనిపిస్తున్నాయి కానీ... మొదటిసారి టిబెట్‌లో ఎత్తైన పర్వతాలపై తొలి యాపిల్ కనిపించింది. అప్పట్లో ఆ ఫ్రూట్‌ని చూసి తినాలో వద్దో అర్థం కాలేదు. అది విషపూరితమైన పండైతే... దాన్ని తింటే ప్రాణాలు పోతాయేమోనని భయపడ్డారు. కొద్ది కొద్దిగా కొరుక్కుని తిన్నారు. ప్రమాదం లేదని అర్థమైంది. అలా యాపిల్ రుచి తెలిసింది. అప్పటి నుంచీ ఇప్పటివరకూ యాపిల్ మనం తినే ఆహారంలో ముఖ్యంగా పండ్లలో కీలకమైన ఫ్రూట్ అయిపోయింది. అసలీ యాపిల్‌కి సంబంధించిన చరిత్ర తెలిస్తే... నిజమా... యాపిల్ వెనక ఇంత కథ ఉందా అనిపించకమానదు. ఆలస్యమెందుకు చకచకా చదివేయండి మరి.
ప్రపంచంలో 8,000 రకాల యాపిల్స్ ఉన్నాయి. ఇవి రకరకాల వాతావరణాల్లో పెరగగలవు. రోజూకో రకం యాపిల్ తింటే... అన్ని రకాలూ తినడానికి 21 ఏళ్లకు పైగా పడుతుంది తెలుసా. పండ్లలో ఎక్కువ రకాలున్నవి యాపిల్సే. మనం సిమ్లా యాపిల్స్, అమెరికా యాపిల్స్ వంటి కొన్ని రకాలనే టేస్ట్ చూస్తున్నాం. నిజానికి ప్రతీ యాపిల్‌కీ ప్రత్యేకమైన టేస్ట్ ఉంటుందట. కారణం అవి పెరిగే వాతావరణం, మట్టి, నీరు, గాలి అన్నీనూ.
8,000 యాపిల్స్‌లో అత్యంత అరుదైనదిగా గుర్తింపు పొందింది బ్లాక్ డైమండ్ యాపిల్. ఇందుకు కారణం దాని కలరే. డార్క్ పర్పుల్ కలర్‌తో ఆకట్టుకుంటుంది. ఎత్తైన పర్వతాలపై సూర్యుడి నుంచీ వచ్చే అతి నీల లోహిత (UV Ray) కిరణాల్ని ఆ యాపిల్ తీసుకుంటుంది. అందువల్ల దాని పైభాగం పర్పుల్, బ్లాక్ కలర్లోకి మారిపోతుంది. ఆ కిరణాల వల్ల యాపిల్ టేస్ట్ మాత్రం దెబ్బతినదు. చైనా లాంటి దేశాల్లో వీటి ధర ఒక్కోటీ రూ.300 రూపాయలు పలుకుతోంది.
ప్రపంచంలో అత్యంత రేటెక్కువ యాపిల్ సెకాయ్ ఇచి యాపిల్. దాని రేటు ఒక్కోటీ రూ.1,500. సెకాయ్ ఇచీ అంటే జపాన్ భాషలో ప్రపంచ నెంబర్ వన్ అని అర్థం. యాపిల్ చెట్టుకి మొదటి ఫ్రూట్ రావాలంటే 4 నుంచీ 5 ఏళ్లు పడుతుంది. చెట్టు నుంచీ యాపిల్ పండును కట్ చెయ్యగానే... నెక్ట్స్ కాయబోయే యాపిల్స్ సంబంధించిన మొగ్గలు రెడీగా ఉంటాయి.
యాపిల్ చెట్టు 100 ఏళ్ల దాకా బతుకుతుంది. ఇప్పటివరకూ ప్రపంచంలో ఎక్కువగా యాపిల్ని ఉత్పత్తి చేస్తున్నది చైనా. యాపిల్ మన మెమరీ పవర్‌ను పెంచుతుంది. యాపిల్‌లో బోరాన్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్రెయిన్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీని సరిచేసి... చురుకుదన్నాన్ని పెంచుతుంది. యాపిల్‌లో ఉండే పెక్టిన్, మన బాడీలో కొలస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది.
ఒక యాపిల్ కాయడానికి తన చుట్టూ ఉన్న 50 ఆకుల నుంచీ ఎనర్జీని లాక్కుంటుంది. యాపిల్ పండ్ల పెంపకాన్ని పోమోలజీ అంటారు. 2010లో యాపిల్ జన్యు పటాన్ని (genome) డీకోడ్ చేశారు. యాపిల్ నీటిలో తేలుతుంది. ఎందుకంటే అందులో 25% గాలే ఉంటుంది. ప్రపంచంలో అత్యంత పెద్ద యాపిల్ బరువెంతో తెలుసా. 1.849 కేజీలు. అది జపాన్... హిరోసాకీ నగరంలోని చిసాటో ఇవాసాకీ పొలంలో అక్టోబర్ 24, 2005లో కాసింది.
ప్రాచీన గ్రీక్, రోమన్లు... యాపిల్స్‌ని ఐశ్వర్యంగా భావించేవాళ్లు. ఎన్ని యాపిల్స్ ఉంటే అంత గొప్ప. మీరు చైనాకి వెళ్తే... అక్కడి వారికి యాపిల్ ఇవ్వండి. చాలా ఆనందపడతారు. ఎందుకంటే... చైనాలో యాపిల్స్‌ని పింగ్ అంటారు. పింగ్ అంటే శాంతి అని అర్థం. ప్రపంచంలో యాపిల్ని చూసి భయపడేవాళ్లు కూడా ఉంటారు. ఆ భయాన్ని మాలుస్డొమెస్టికాఫోబియా అని పిలుస్తారు. న్యూయార్క్ నగరానికి ది బిగ్ యాపిల్ అనే నిక్ నేమ్ ఉంది.