దాదాపు అన్ని అనారోగ్య సమస్యలను తగ్గించగల శక్తి నడకకు ఉందంటే అతిశయోక్తి కాదు. అందుకే ఉదయాన్నే లేచి వాకింగ్ చేస్తుంటారు ప్రజలు. అయితే అన్ని వ్యాయామాల లాగానే వాకింగ్ కూడా సరిగా చేస్తేనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. చాలా మందిలో ఉదయం పూట వాకింగ్ (Morning Walk) చేయాలా? లేదా సాయంత్రమా? అనే సందేహం ఉంటుంది. పొద్దున్నే ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుందని, అప్పుడు వాకింగ్ చేస్తే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని కొందరు నమ్ముతారు.
అయితే సాయంత్రం వేళ కూడా వాకింగ్ చేయవచ్చు. కానీ రోజంతా పని చేసి అలసి పోతే అంత ఉత్సాహంగా వాకింగ్ చేయలేరు. నిజానికి ఏ సమయంలో వాకింగ్ చేసినా మంచిదే కానీ భోజనం చేసిన తర్వాత వాకింగ్ (Walking After Meals) చేస్తే ఇంకా మంచిది. భోంచేసిన తర్వాత ప్రతి ఒక్కరూ కాసేపు నడవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ అలవాటుతో ప్రయోజనాలు ఏంటో చూద్దాం.
* గుండె ఆరోగ్యానికి మేలు : వాకింగ్ అనేది గుండె ఆరోగ్యానికి అంత మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. భోజనం తర్వాత నడవడం వల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అయితే కడుపు నిండా ఆహారం తిన్న వారు వెంటనే నడవకూడదు. ఎందుకంటే హెవీ మీల్స్ జీర్ణమవ్వాలంటే జీర్ణకోశ వ్యవస్థకు రక్త ప్రసరణ బాగా జరగాలి. ఈ సమయంలో వాకింగ్ చేస్తే హార్ట్ పై ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. అందుకే కడుపునిండా భోజనం చేసిన వారు రెండు లేదా మూడు గంటల తర్వాత వాకింగ్ చేయడం మంచిది.
* సులభంగా జీర్ణమయ్యే ఆహారం : భోజనం చేసిన తర్వాత కాసేపు నడిస్తే జీర్ణక్రియ శక్తి మెరుగుపడుతుంది. తిన్న ఆహారం సవ్యంగా జీర్ణం కావాలంటే 5 నిమిషాలు నడిచినా చాలు అంటున్నారు వైద్యులు. వాకింగ్ చేస్తే ఆహారంలోని పోషకాలు శరీరానికి చక్కగా వంటబడతాయి. జీర్ణక్రియ వ్యవస్థలోని పేగుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
* రక్తపోటుకు చెక్ : భోజనం తర్వాత చేసే వాకింగ్ రక్తపోటును తగ్గించడంలో దోహద పడుతుంది. భోజనం చేశాక నడిస్తే సిస్టోలిక్ రక్తపోటుపై ప్రభావం పడి బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది. భోజనం చేయగానే 15 నిమిషాల నడకకు వెళ్లడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని, ఫలితంగా టైప్ 2 డయాబెటిస్ వంటి వ్యాధులు రావని శాస్త్రవేత్తలు కూడా కనుగొన్నారు.
* వెయిట్ లాస్ : తిన్న తర్వాత కాసేపు నడిస్తే ఆహారం చక్కగా జీర్ణం అవ్వడంతో పాటు కేలరీలు కరుగుతాయి. దీని వల్ల బరువు తగ్గడం సాధ్యమవుతుంది. తీసుకున్న కేలరీల కంటే ఖర్చుచేసే కేలరీలు ఎక్కువగా ఉంటేనే బరువు తగ్గుతారు కాబట్టి భోజనం చేసిన తర్వాత కేలరీలు ఖర్చు అయ్యేలా నడవాలి. అయితే ఫుడ్ తిన్న తర్వాత నడిచేటప్పుడు కొందరికి కడుపు నొప్పి, అలసట లేదా ఇతర అసౌకర్యం కలుగుతుంది. వీరు తప్ప మిగతా వారందరూ కూడా లంచ్, డిన్నర్ తర్వాత 30 నిమిషాల పాటు చాలా వేగంగా నడవాలి. ఇలా చేస్తే బరువు ఇట్టే తగ్గిపోతారు.