కోడి మాంసం తినేవాళ్ల కంటే... రెడ్ మీట్ (మటన్, పోర్క్ లాంటివి) తినేవాళ్లకు బ్రెస్ట్ (రొమ్ము) కాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కాన్సర్‌లో వివరాలు తెలిపారు.
జనరల్‌గానే మటన్, పోర్క్ వంటివి ఎక్కువగా తింటే... బరువు పెరుగుతారు, అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఇంకా చాలా రకాల అనర్థాలకు రెడ్ మీట్ కారణమవుతోంది. అదే కోడి మాంసం తింటే మాత్రం బ్రెస్ కాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటున్నట్లు తేలింది.
ప్రపంచవ్యాప్తంగా 42,012 మంది మహిళలు వండుతున్న ఆహార వంటల విధానంపై, అలాగే వాళ్లు వండుతున్న మాంసాలపై దాదాపు 8 ఏళ్లుగా పరిశోధనలు చేశారు.
1,536 మంది బ్రెస్ కాన్సర్ వచ్చిన పేషెంట్లను పరిశీలించారు. ఏ మహిళలైతే ఎక్కువగా రెడ్ మీట్ తింటున్నారో, వారికి బ్రెస్ట్ కాన్సర్ వచ్చే అవకాశాలు 23 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది.
అదే కోడి మాంసం తింటున్న మహిళల్లో బ్రెస్ కాన్సర్ వచ్చే అవకాశాలు 15 శాతం తక్కువగా ఉంటున్నాయి. మటన్, పోర్క్ వంటివి తినడం తగ్గించి... వాటి బదులు కోడి మాంసం తినే మహిళలకు కాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటున్నట్లు తెలిసింది.
సాధారణంగా కాన్సర్ వచ్చేందుకు అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, ఆల్కహాల్ వాడకం, అసంబద్ధ ఆహారం ఇలా ఎన్నో కారణాలుంటాయి. ఐతే... రెడ్ మీట్లో ఉండే కార్సినోజెన్ అనే పదార్థం ఉంటుంది. అది కాన్సర్ వచ్చేందుకు కారణమవుతోంది.