ఉప్పు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ విషయం దాదాపు అందరికీ తెలుసు. కానీ ఏదైనా అనారోగ్యం పాలైతే తప్ప చాలామంది ఇలాంటి జాగ్రత్తలు తీసుకోరు. అయితే ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల హై అధిక రక్తపోటు, పక్షవాతం, గుండె జబ్బులు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా దీని దుష్ప్రభావాలు పురుషుల్లో కంటే స్త్రీలలోనే ఎక్కువ అంటోంది లేటెస్ట్ రీసెర్చ్. ఈ అంశంపై జరిగిన తాజా అధ్యయనం ఏం చెబుతోందో చూద్దాం.
AHA, హైపర్టెన్షన్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. అన్ని వయసులకు చెందిన స్త్రీలకు ఉప్పు ప్రభావాలను తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది. పీరియడ్స్ మొదలైన తర్వాత శరీరం ఎక్కువ ఉప్పును తీసుకోగల శక్తి వీరిలో తగ్గుతుంది. రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో సాల్ట్-సెన్సిటివ్ బ్లడ్ ప్రెజర్(SSBP) ఎక్కువగా కనిపిస్తుంది. పీరియడ్స్ ఆగిపోవడం SSBP తీవ్రతను, అవకాశాలను పెంచుతుంది.
* తీసుకోవాల్సిన జాగ్రత్తలు : ఉప్పులో 40 శాతం సోడియం అయాన్లు, 60 శాతం క్లోరైడ్ అయాన్లు ఉంటాయి. కండరాలు సంకోచించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, శరీరంలోని ఖనిజాలు, నీటి సమతుల్యతను కాపాడుకోవడానికి శరీరానికి తక్కువ మొత్తంలో సోడియం అవసరం అవుతుంది. ఒక వ్యక్తికి రోజుకు 500mg ఉప్పు (లేదా పావు టీస్పూన్) వినియోగం సరిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తెలిపింది. కానీ చాలామంది ఇంతకంటే ఎక్కువ మొత్తంలో సాల్ట్ వినియోగిస్తున్నారు.
ఆరోగ్యకరమైన రక్త ప్రవాహం కోసం సోడియం-పొటాషియం సమతుల్యతను అదుపులో ఉంచడానికి, అరటిపండ్లు, బంగాళదుంపలు, ఆకుకూరలు, వాల్నట్లు వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. గసగసాలు, పుచ్చకాయ గింజలు కూడా రక్తపోటును కంట్రోల్ చేస్తాయి. వీటిలో మెగ్నీషియం, కాల్షియం అధికంగా ఉంటాయి. ప్రాసెస్ చేసిన ఆహారానికి వీలైనంత దూరంగా ఉండాలి.
* ప్రత్యామ్నాయాలు అవసరం : శారదా హాస్పిటల్ MD (ఇంటర్నల్ మెడిసిన్), డాక్టర్ శ్రేయ్ శ్రీవాస్తవ్ మాట్లాడుతూ.. క్లినికల్, ఎక్స్పెరిమెంటల్ డేటా ప్రకారం, ఆహారంలో ఉప్పు తీసుకోవడం అనేది పురుషులు, స్త్రీలలో వేర్వేరుగా ఆల్డోస్టెరాన్ ఉత్పత్తి చేస్తుందన్నారు. మహిళల్లో అధిక ఉత్పత్తికి అనుకూలంగా ఉంటుందని, అందుకే మహిళల్లో సాల్ట్-సెన్సిటివ్ హైపర్టెన్షన్ ప్రాబల్యం పెరుగుతుందన్నారు.
జీవనశైలిలో మార్పులు, ఉప్పు తీసుకోవడం తగ్గించడంతోపాటు ఉప్పు ప్రత్యామ్నాయాల కోసం వెతకడం మహిళలకు సహాయపడుతుందని చెప్పారు. MR యాంటీగానిస్ట్స్(మినరల్ కార్టికాయిడ్-రిసెప్టర్ యాంటీగానిస్ట్స్) అనేది ఒక యాంటీ-హైపర్టెన్సివ్ మెడిసిన్ అని చెప్పారు. ఇది ప్రస్తుతం ఎసెన్షియల్ హైపర్టెన్షన్(సాల్ట్-సెన్సిటివ్ హైపర్టెన్సివ్ యువతులకు చేసే చికిత్స)కు మొదటి ప్రాధాన్యం కాదన్నారు.