గుజరాత్... జామ్‌నగర్‌లోని... కలావద్ తాలూకాలో జసపార్ అనే ఊరుంది. అక్కడ నివసిస్తున్న జెంతీభాయ్ ఫాల్దూ అనే రైతు... రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో... డ్రాగన్ పండ్ల సాగు చేపట్టాడు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆత్మ ఏజెన్సీ ఆయనకు సలహాలు, సూచనలు ఇచ్చింది. నిజానికి రొటీన్ పంటలు వేసి బోర్ కొట్టిన ఆయన... కొత్తగా ఏదైనా చెయ్యాలనుకున్నాడు. వెంటనే ప్రభుత్వం సహకరించింది. సాధారణంగా... హార్టికల్చర్ విధానంలో... ఒకసారి పూలు వచ్చాక... మళ్లీ మూడేళ్లకు గానీ రావు. కానీ... డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకు ఏడాదిలోపే పూలు వస్తాయి. ఇందుకోసం సేంద్రియ ఎరువులు, బిందు సేద్యం (drip irrigation) విధానం పాటించాడు. పూర్తి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో ఈ పండ్లను సాగుచేశాడు.
డ్రాగన్ పండ్లు... వర్షాకాలంలో నాలుగు నుంచి 5 రెట్లు ఎక్కువగా వస్తాయి. ఇలా ఒక వర్షాకాల సీజన్లో జెంతీభాయ్... రూ.3.25 లక్షల ఆదాయం పొందాడు. రెండేళ్ల కిందట ప్రయోగాత్మకంగా ఈ సాగు చేపట్టాడు. ఇప్పుడు బే విఘా ఏరియాలో రైతులంతా డ్రాగన్ ఫ్రూట్స్ పండించడం మొదలుపెట్టారు. ఇందులో విజయం సాధించిన జెంతీభాయ్... నెక్ట్స్ టిష్యూ కల్చర్ (tissue culture) విధానంలో... సీతాఫలాలను మరో ప్రాంతంలో ప్రయోగాత్మకంగా సాగు చేయడం ప్రారంభించాడు.
జెంతీభాయ్ మామూలోడు కాదు. పండ్లను ఎలా అమ్మితే ఎక్కువ ధర వస్తుందో అతను తెలుసుకున్నాడు. ముందుగానే ఆర్గానిక్ లైసెన్స్, ఫ్రూట్ క్వాలిటీ లైసెన్స్ పొందాడు. ఇవి రెండూ ఉన్నవారు... నాణ్యమైన పండ్లనే పండిస్తారు. తద్వారా వాటికి ధర ఎక్కువే పలుకుతుంది. జెంతీభాయ్... తన తోటలో కాసిన డ్రాగన్ పండ్లను ఎక్కడికీ తీసుకెళ్లి అమ్మడు. ప్రజలే తన తోటకు వచ్చి కొనుక్కుంటున్నారు. ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్ (సేంద్రియ వ్యవసాయం)లో సూపర్ సక్సెస్ అయిన ఆయన్ని... ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మెచ్చుకున్నారంటే... అతని గొప్పదనాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు జెంతీభాయ్... మరో రైతు విశాల్ భాయ్‌తో కలిసి ఓ నర్సరీ ప్రారంభించాడు. ఇందులో 65,000 డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్ని ఉంచాడు. ఎవరైనా ఈ మొక్కలు కావాలనుకుంటే... కొనుక్కోవచ్చు. గుజరాత్తోపాటూ... దేశంలోని అన్ని రాష్ట్రాల వారికీ అమ్ముతున్నాడు. జెంతీభాయ్ చెబుతున్నది ఒక్కటే. తరతరాలుగా అదే వ్యవసాయం చేస్తున్నాం... కాలం మారుతోంది... మనమూ మారాలి. కొత్త పంటలు సాగు చెయ్యాలి. లాభాలు సాధించాలి అంటున్నాడు. లక్కేంటంటే... గుజరాత్ ప్రభుత్వం మోడ్రన్ వ్యవసాయానికి 100 శాతం అండగా ఉంటోంది. పూర్తి ట్రైనింగ్ ఇప్పిస్తోంది. అందుకే అక్కడి రైతులు విపరీతమైన లాభాలు సాధిస్తున్నారు. వాళ్లైతే కాంట్రాక్ట్ వ్యవసాయం కూడా భారీ ఎత్తున చేస్తున్నారు.
కొత్త వ్యవసాయం చేయాలనుకున్న జెంతీభాయ్కి జామ్‌నగర్ జిల్లా అభివృద్ధి అధికారి (DDO) మిహిర్ పటేల్ సాయం చేశారు. ఏ పంట వెయ్యాలో, ఎలా సాగు చెయ్యాలో పూర్తి ట్రైనింగ్ ఇప్పించారు. అలాగే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా చేశారు. ప్రభుత్వ పథకాలన్నీ అతనికి చేరేలా చేశారు. ఫలితంగా జెంతీభాయ్ ఇప్పుడు సంపన్న రైతుగా మారాడు. సరిగ్గా చేస్తే వ్యవసాయంలో వచ్చే లాభాలు మామూలుగా ఉండవని నిరూపిస్తున్నాడు.