చలికాలంలో చర్మం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం. ఒక వారం పాటు జంక్ ఫుడ్ తీసుకుంటే, చర్మం నిస్తేజంగా తయారవుతుంది. అదే మంచి ఆహారం తింటే అందంగా మెరుస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం రోగనిరోధక శక్తిని పెంచడానికి, శరీర బరువు అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. ఇది చర్మానికి పునరుజ్జీవాన్ని కలిగిస్తుంది. ముడతలను తగ్గిస్తుంది. దీంతో చర్మం మెరుపు పొందుతుంది.
సిట్రస్ ఫ్రూట్స్ : శీతాకాలంలో ఎక్కువగా లభించే సిట్రస్ ఫ్రూట్స్(Citrus fruits) యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. దీంతో మొటిమలు, పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ కు చికిత్స చేయడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఇవి చర్మాన్ని కాంతివంతం చేసి ప్రీఏజింగ్ తగ్గించే ఏజెంట్‌గా పని చేస్తాయి. చలి కాలంలో కమలాఫలం, ద్రాక్ష, నిమ్మ లాంటి పుల్లగా ఉండే సిట్రస్ ఫ్రూట్స్ సమృద్ధిగా లభిస్తాయి. వీటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అందుకనే వీటిని శీతాకాలపు సూపర్‌ఫుడ్స్ గా చెబుతారు.
చియా సీడ్స్ : చియా సీడ్స్(Chia Seeds)లో ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. మొటిమల మచ్చలు, ఫైన్ లైన్స్, ముడతలను తగ్గిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సూర్యరశ్మి వల్ల కలిగే ప్రీ రాడికల్స్ తోనూ ఫైట్ చేస్తాయి. ఇవన్నీ కలిసి చర్మాన్ని సంరక్షిస్తూ.. మెరిసేలా చేస్తాయి.