ప్రపంచవ్యాప్తంగా వారానికి నాలుగు రోజుల పని అనే వర్క్ మోడ్‌కి ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే యూకే (UK)లో 4-డే వర్క్ ఏ వీక్ (4-Day Work A Week) అనే వర్క్ మోడ్ కోసం ఆరు నెలల అతిపెద్ద పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది. సోమవారం యూకేలోని 70 కంపెనీల్లో పని చేసే వేలాది మంది ఉద్యోగులతో వారానికి నాలుగు రోజుల వర్క్ అనే పని విధానం ట్రయల్ చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ కార్యక్రమాన్ని 4 డే వీక్ గ్లోబల్, అటానమీ, థింక్ ట్యాంక్, 4 డే వీక్ యూకే క్యాంపెయిన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, బోస్టన్ కాలేజ్ రీసెర్చర్లు కలిసి నిర్వహిస్తున్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ వీక్లీ వర్క్ షెడ్యూల్ పాపులర్ అవుతోందా? ఏ దేశాలు ఈ పని విధానానికి శ్రీకారం చుట్టబోతున్నాయి? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
100:80:100 మోడల్
యూకేలోని పైలట్ ప్రాజెక్టులో పాల్గొనే వారికి పెద్ద ప్రయోజనం ఏమిటంటే... వారి వేతనంలో ఎలాంటి కోతలు ఉండవు. 100:80:100 మోడల్‌పై ఆధారపడిన ట్రయల్ సమయంలో, 100 శాతం ప్రొడక్టివిటీ కనబరిస్తే 80 శాతం సమయానికి 100 శాతం జీతం చెల్లిస్తారు. "యూకే అంతటా, 30 కంటే ఎక్కువ రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 3,300 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఈ ట్రయల్‌లో పాల్గొంటారు.
కనీసం 100 శాతం ప్రొడక్టివిటీ చూపించిన వారు 80 శాతం సమయానికి 100 శాతం వేతనం అందుకుంటారు" అని ది 4 డే వీక్ క్యాంపెయిన్ ఒక ప్రకటనలో తెలిపారు. వారానికి నాలుగు రోజుల పని అంటే వారంలో మూడు రోజులు సెలవులు వస్తాయని అర్థం. దీనివల్ల కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం సాధ్యమవుతుంది. అలానే పనిభారం తగ్గినట్టు అనిపిస్తుంది.
షార్ట్ అండ్ స్మార్ట్‌గా వర్క్
4 డే వీక్ గ్లోబల్ సీఈఓ జో ఓ'కానర్ మాట్లాడుతూ.. ఉద్యోగులు తక్కువ సమయంలో స్మార్ట్‌గా వర్క్ అంతా పూర్తి చేయగలమని నిరూపించినట్లు తెలిపారు. కరోనా నుంచి బయటపడ్డాక జీవన నాణ్యత, తక్కువ-గంటల పని, అవుట్‌పుట్-ఫోకస్డ్ వర్క్, పోటీతత్వానికి ప్రాధాన్యత పెరిగినట్లు కంపెనీలు గుర్తిస్తున్నాయని జో ఓ'కానర్ పేర్కొన్నారు. ఈ వర్క్ మోడ్ ఉద్యోగులు, కంపెనీలు, వాతావరణ సంరక్షణకు సహాయపడుతుందని నిర్వాహకులు అంటున్నారు.
ఈ ఆరు నెలల కాలంలో ఉద్యోగుల ప్రొడక్టివిటీ, శ్రేయస్సు, అలాగే పర్యావరణం, లింగ సమానత్వంపై ప్రభావాన్ని అంచనా వేయడానికి పరిశోధకులు ప్రతి కంపెనీతో కలిసి పని చేస్తారు. కాగా, వారానికి నాలుగు రోజుల పని ట్రయల్స్‌లో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా 150 కంపెనీలు, యునైటెడ్ స్టేట్స్, కెనడా, యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోని 7,000 మంది ఉద్యోగులు సైన్ అప్ చేసారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఐస్‌ల్యాండ్‌లో ఇప్పటికే ట్రయల్స్ ఫినిష్
యూకేలో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం కాకముందే ఐస్‌ల్యాండ్‌లో ఈ తరహా పని విధానం పైలట్ ప్రాజెక్టుగా జరిగింది. ఐస్‌ల్యాండ్‌లో 2015-2019 మధ్య కాలంలో 2,500 మంది ప్రభుత్వ రంగ ఉద్యోగులతో రెండు పెద్ద ట్రయల్స్ జరిగాయి. ఈ వారానికి తక్కువ రోజుల వర్క్ మోడ్‌లో ఉద్యోగి ప్రొడక్టివిటీలో ఎలాంటి తగ్గుదల లేదని, కానీ వారి శ్రేయస్సు బాగా పెరిగిందని తేలింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇదిలా ఉండగా, ఈ ఏడాది చివర్లో స్పెయిన్, స్కాట్లాండ్లలో తదుపరి ప్రభుత్వ-మద్దతు గల ట్రయల్స్ జరగబోతున్నాయని 4 డే వీక్ క్యాంపెయిన్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. దీన్ని బట్టి చూస్తుంటే త్వరలోనే మరిన్ని దేశాల్లోని కంపెనీలు వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేసేలా ఉద్యోగులకు వెసులుబాటు కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.