రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టారని ఇది పక్కా ఎలక్షన్ బడ్జెట్ అని కొందరు, చాలా రంగాలకు మొండి చేయి చూపారని మరికొందరు, అమృతకాల బడ్జెట్ అని ఇంకొందరు ఇలా ఎవరి అభిప్రాయం వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
* చదువుకు పెద్ద పీట : కొవిడ్ కారణంగా విద్యార్థులు కొన్ని నెలలపాటు ఇంటి దగ్గరే ఉన్నారు. పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణత సాధించారు. ఈ కారణాలతో పిల్లల్లో చదివే సామర్థ్యం బాగా పడిపోయిందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. పిల్లల్లో పఠన సామర్థ్యం పెంచేలా, విద్యా వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా 2023-24 బడ్జెట్లో రూ. 1,12,898.97లక్షల కోట్లు కేటాయించారు.
ఇందులో పాఠశాల విద్యకు రూ.68,804.85 కోట్లు, ఉన్నత విద్యకు రూ.44,094.62 కోట్లు కేటాయించారు. 2022-23లో అయితే ఈ రంగానికి రూ.1,04,278 కోట్లు కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే రూ.11,054 కోట్లు పెరిగింది. సవరించిన అంచనాల ప్రకారం ఉన్నత విద్యకు రూ.40,828.35 కోట్లు కాగా, పాఠశాల విద్యకు రూ.59,052.78 కోట్లు సర్దుబాటు చేశారు. 2021-22 బడ్జెట్లో కేవలం రూ.93,223 కోట్లు మాత్రమే విద్యా రంగానికి ప్రకటించారు. వీటితో పాటు సమగ్ర శిక్షకు రూ.37,453.47 కోట్లు, పీఎం పోషణ్‌కు రూ.11,600 కోట్లు నిర్మలమ్మ ప్రకటించారు.
* టెక్నాలజీ అందిపుచ్చుకునేలా : రాబోయేది 5G కాలం. ఈ క్రమంలో 5G సేవలను ఉపయోగించి అప్లికేషన్లను అభివృద్ధి చేయడానికి ఇంజినీరింగ్ కాలేజీల్లో 100 ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని సీతారామన్ ప్రకటించారు. ఈ ల్యాబ్‌లలో స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు ఉంటాయని, ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టం, హెల్త్‌కేర్ అప్లికేషన్స్ వంటి వాటిని డెవలప్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయని ఆమె వివరించారు.
వేర్వేరు సంస్థలు, వ్యవస్థల సాయంతో వీటిని అందుబాటులోకి తెస్తామన్నారు. టాప్ మోస్ట్ విద్యాసంస్థల్లో ఏ.ఐ. (Artificial Intelligence)ను అభివృద్ధి చేసేలా మూడు ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. వైద్య అవసరాలు తీర్చేలా 57 మెడికల్ కాలేజీలకు అనుసంధానంగా 157 నర్సింగ్ కాలేజీలను సిద్ధం చేస్తామన్నారు.
* డిజిటల్ లైబ్రరీలు : పాఠశాల, కళాశాల విద్యార్థుల కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీని తీసుకొస్తామన్నారు. ఇందులో వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంచుతామన్నారు. రాష్ర్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో నేషనల్ డిజిటల్ లైబ్రరీ నిధులతో వార్డు, పంచాయతీ స్థాయిల్లో ఫిజికల్ లైబ్రరీలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. నేషనల్ బుక్ ట్రస్ట్, చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్ వంటి సంస్థల సహకారంతో ఇంగ్లీష్ భాషతో పాటు స్థానిక భాషల్లో పుస్తకాలు లభించేలా చొరవ తీసుకుంటామని మంత్రి ప్రకటించారు.