విద్యార్థులకు పరీక్షల సీజన్ (Exams Season) మొదలైంది. బోర్డు ఎగ్జామ్స్, ఎంట్రెన్స్ ఎగ్జామ్ల నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. పరీక్షలపై విద్యార్థులు పూర్తిగా దృష్టి సారించారు. ఇటీవలే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను ప్రకటించింది. ప్రధానంగా నీట్, జేఈఈ, సీయూఈటీ, బిట్షాట్ వంటి పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
* జేఈఈ మెయిన్ : జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్-2023 సెషన్ -1కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 15న ప్రారంభం అయింది. జనవరి 12న ముగియనుంది. జేఈఈ మెయిన్ సెషన్-2 కోసం రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 7న ప్రారంభమై, మార్చి 7న ముగియనుంది. సెషన్-1 అడ్మిట్ కార్డ్ జనవరి మూడో వారంలో రిలీజ్ కానుంది. సెషన్-2 కోసం మార్చి చివరివారంలో విడుదల చేయనున్నారు. జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలు జనవరి 24 నుంచి 31 మధ్య జరగనుంది. సెషన్-2 పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి. జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాలు ఫిబ్రవరి పదో తేదీ వెల్లడయ్యే అవకాశం ఉంది.
* జేఈఈ అడ్వాన్స్డ్ : దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 30న ప్రారంభమై, మే 4న ముగియనుంది. అడ్మిట్ కార్డ్ మే 29 నుంచి జూన్ 4 మధ్యలో రిలీజ్ చేయవచ్చు. పరీక్ష జూన్ 4వ తేదీని నిర్వహించనున్నారు. ఫలితాలు జూన్ 18న వెల్లడయ్యే అవకాశం ఉంది.
* సీయూఈటీ : దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం సీయూఈటీ పరీక్షను నిర్వహిస్తారు. సీయూఈటీ-2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి నుంచి మార్చి నాలుగో వారం వరకు కొనసాగనుంది. ఇక, అడ్మిట్ కార్డ్లు ఏప్రిల్ మూడో వారంలో రిలీజ్ కానున్నాయి. సీయూఈటీ-2023 పరీక్ష మే 21 - 31 తేదీల మధ్య జరగనుంది. ఫలితాలు జూలై నాలుగో వారంలో వెల్లడి కావచ్చు.
* నీట్ : దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ పరీక్ష నిర్వహిస్తారు. నీట్-2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి రెండో వారం నుంచి ప్రారంభమై, ఫిబ్రవరి చివరి వారంతో ముగియనుంది. అడ్మిట్ కార్డులు మే మూడో వారంలో రిలీజ్ అవుతాయి. నీట్ పరీక్ష మే 7వ తేదీని నిర్వహించనున్నారు. ఫలితాలు జులైలో వెల్లడి కావచ్చు.