తెలంగాణలో ఈ నెల 24న ఇంటర్ పరీక్షలు ముగిసన విషయం తెలిసిందే. అయితే.. ఓ వైపు పరీక్షలు జరుగుతుండగానే మరో వైపు ఈ నెల 12న వాల్యుయేషన్ ను సైతం ప్రారంభించింది ఇంటర్ బోర్డ్. గతంలో ఇంటర్ ఫలితాల విషయంలో గందరగోళం నెలకొనడం, విద్యార్థులు ఆందోళనలకు దిగిన నేపథ్యంలో అలాంటి ఘటనలకు ఆస్కారమే ఇవ్వకూడదన్న లక్ష్యంతో ఇంటర్ బోర్డ్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
ప్రతీ దశను ఉన్నతాధికారులు జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14 కేంద్రాల్లో ఇంటర్ పేపర్ల వాల్యుయేషన్ ను నిర్వహిస్తోంది ఇంటర్ బోర్డ్. ఇంటర్ ఫలితాలను జూన్ 10న విడుదల చేయాలన్న లక్ష్యంతో ఇంటర్ బోర్డ్ పని చేస్తోంది. ఇదిలా ఉంటే.. గత రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ఫస్టియర్ పరీక్షలను ఆయా విద్యార్థులు సెకండియర్ లో ప్రవేశించిన అనంతరం నిర్వహించారు.
అయితే.. కేవలం 49 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదు కావడంతో విద్యార్థులతో పాటు వివిధ వర్గాల నుంచి తీవ్రంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఫెయిలయిన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు సైతం పాల్పడడంతో స్పందించిన ప్రభుత్వం ఫెయిలయిన వారందరినీ మినిమం మార్కులతో పాస్ చేసింది. అయితే.. ఈ సారి మళ్లీ అలా పాస్ చేసే పరిస్థితి ఉండదని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అనేక మార్లు స్పష్టం చేశారు. విద్యార్థులు కష్టపడి చదవాలని సూచించారు.
కాగా.. 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ షెడ్యూల్ ను సైతం ఇంటర్ బోర్డ్ ఖరారు చేసింది. మొత్తం 221 వర్కింగ్ డేస్ తో కూడిన షెడ్యూల్ ను ఇంటర్ బోర్డ్ ఇటీవల విడుదల చేసింది. జూలై 1న ఇంటర్ ఫస్టియర్ తరగతులు ప్రారంభించనున్నట్లు ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. ఇంటర్ సెకండియర్ క్లాసులను జూన్ 15న ప్రారంభించనున్నట్లు బోర్డు తెలిపింది.
అక్టోబర్ 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వరకు ఇంటర్ విద్యార్థులకు దసరా సెలవులు ఉంటాయని బోర్డు తన ప్రకటనలో పేర్కొంది. సంక్రాతి సెలవులు 2023 జనవరి 13 నుంచి 15వ తేదీ వరకు ఉంటాయని తెలిపింది. వచ్చే ఏడాది ఇంటర్ ఎగ్జామ్స్ 2023 మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డ్ ఇటీవల విడుదల చేసిన షెడ్యూల్ లో వెల్లడించింది. పరిస్థితుల ఆధారంగా ఈ షెడ్యూల్ లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.