తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 17 వేల ఖాళీల భర్తీకి అధికారులు ఇటీవల జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి 541 ఖాళీలు, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి 14,881 ఖాళీలకు అధికారులు నోటిఫికేషన్లు విడుదల చేశారు. జైళ్ల శాఖలో 8 డిప్యూటీ జైలర్లు, 146 వార్డర్లు, రవాణా శాఖలో 63 ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుల్, ఎక్సైజ్ శాఖలో 614 ప్రొహిబిషన్ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆయా నోటిఫికేషన్లలో పేర్కొన్నారు.
అయితే.. ఈ ఉద్యోగాలకు సంబంధించి కేవలం మూడేళ్ల వయో సడలింపు మాత్రమే ఇచ్చింది ప్రభుత్వం. కాగా.. 2018 నుంచి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కాలేదని.. దీంతో నాలుగేళ్లు వృథా అయ్యాయయని ఇప్పుడు మూడేళ్లను మాత్రమే వయో సడలింపు ఇవ్వడం సరికాదని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండేళ్ల వయో సడలింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అనేక ఆందోళనలను చేపట్టారు.
ప్రగతి భవన్ ను సైతం ముట్టడించినా ఫలితం లేకుండా పోయింది. ఇదే విషయాన్ని ఓ నిరుద్యోగి మంత్రి కేటీఆర్ దృష్టికి మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన కేటీఆర్ విషయాన్ని మంత్రి మహమూద్ అలీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ విషయంలో సానుకూలంగా స్పందన వస్తుందని అంతా భావించారు. కానీ ఇప్పటి వరకు అధికార ప్రకటన రాకపోవడంతో నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. దీంతో ఇక వయోపరిమితి పెంపుపై ఇక ప్రకటన రానట్లేనని అంతా అంచనా వేస్తున్నారు.
ఆగస్టు నెలలోనే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించాలన్నది తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఆగస్టు 7వ తేదీన ఎస్ఐ జాబ్స్ కు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుందని బోర్డు వర్గాల నుంచి సమాచారం. ఈ ఎగ్జామ్ ముగిసిన వెంటనే రెండు వారాల తేడాతో ఆగస్టు 21న కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ రెండు తేదీలు కూడా ఆదివారం రోజే వస్తున్నాయి. దీంతో సెలవు రోజు కావడంతో ప్రస్తుతం చదువుకుంటున్న వారు, ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎగ్జామ్స్ కు హాజరు కావొచ్చు. అయితే, ఈ తేదీలకు సంబంధించిన అధికారిక ప్రకటన బోర్డు నుంచి రావాల్సి ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ ను 200 మార్కులకు నిర్వహించనున్నారు. ఇందులో 30 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు తర్వాతి దశకు అర్హత సాధిస్తారు.
దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు తుది రాత పరీక్షకు అర్హత సాధిస్తారు. తుది రాత పరీక్షల్లో సత్తా చాటిన అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. మొత్తం నియామక ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కసరత్తు చేస్తోంది.