తెలంగాణలో దాదాపు 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవల అనేక సార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయా ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. అయితే.. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ల ప్రకటన వాయిదా పడుతుండడంతో వారిలో నిరాశ వ్యక్తమవుతోంది. అయితే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ పూర్తి కాగానే జాబ్ నోటిఫికేషన్లు విడుదల అవుతాయని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఉద్యోగుల విభజన ప్రక్రియ మొదలైందని ఆయన వెల్లడించారు. జోనల్ విధానంతో ఉద్యోగులకు మంచి అవకాశం లభించదని గతంలో ఉద్యోగ సంఘాల నేతగా పని చేసిన ఆ మంత్రి అభిప్రాయపడ్డారు.
ఉద్యోగాల సర్దుబాటు ప్రక్రియ పూర్తి కాగానే.. ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో స్పష్టత వస్తుందని మంత్రి వివరించారు. మంగళవారం నాంపల్లిలో జరిగిన తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (TGO) సమావేశంలో మంత్రి ఈ వాఖ్యలు చేశారు. అయితే ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ ఈ నెలాఖరుకు ముగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అన్ని అనుకున్నట్లు ఈ నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తయితే.. జనవరి 1 న్యూఇయర్ కానుకగా కొన్నైనా నోటిఫికేషన్లను విడుదల చేయాలన్నది సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది. ఒక వేళ సాధ్యం కాకపోతే జనవరి నెలాఖరు వరకైనా పూర్తి స్థాయిలో నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే.. ఉద్యోగ ఖాళీల్లో దాదాపు 30 వేల నుంచి 40 వేల వరకు పోలీస్, టీచర్ ఉద్యోగాలే ఉండే అవకాశం ఉంది.
రాష్ట్రంలో మొత్తం టీచర్ ఉద్యోగాల సంఖ్య 22 వేలు ఉంటుందని అధికారులు లెక్క తేల్చారు. రాష్ట్రంలో మొత్తం 351 కేడర్లు ఉన్నట్లు అధికారుల లెక్కల్లో తేలింది. ఇంకా.. రాష్ట్రంలో మొత్తం 1.31 లక్షల టీచర్ జాబ్ లను ప్రభుత్వం మంజూరు చేయగా.. ఇందులో ప్రస్తుతం పని చేస్తున్న వారి సంఖ్య 1.09 లక్షలుగా అధికారులు గుర్తించారు. దీతో ఖాళీలు 22 వేలుగా అధికారులు తేల్చారు.