కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ఈ నెల 30 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే.. సిలబస్ పూర్తి కాక విద్యార్థులు నష్టపోకూడదన్న లక్ష్యంతో ఈ రోజు అంటే జనవరి 24 నుంచి ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కేవలం 8, 9, 10 తరగతుల వారికి మాత్రమే ఈ ఆన్లైన్ క్లాసులు కొనసాగనున్నాయి.
అయితే.. టీశాట్ చానల్ ద్వారా నేటి నుంచి విద్యార్థులకు పాఠాలను ప్రసారం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబందించిన టైం టేబుల్ ను రాష్ట్ర విద్యా సంకేతిక సంస్థ (సైట్) తాజాగా విడుదల చేసింది. టైంటేబుల్ ప్రకారం ఈ నెల 24వ తేదీ అంటే ఈ రోజు నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పాఠాలు ప్రసారం కానున్నాయి. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియం వారికి ఈ తరగతులు ప్రసారం కానున్నాయి.
ఒక్కో మీడియం వారికి రెండు తరగతుల చొప్పున ప్రసారం కానున్నాయి. అయితే ఒక్కో పాఠం 30 నిమిషాల పాటు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఈ తరగతులు 24, 25, 27,28 తేదీల్లో మాత్రమే ప్రసారం కానున్నాయి. 26, 19, 30 తేదీల్లో పాఠాలు ప్రసారం కావు. ఈ నెల 26న రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా సెలవు ప్రకటించారు. 29, 30 శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో ఆ రోజుల్లో సైతం పాఠాలు ప్రసారం కావు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.
అయితే, కరోనా నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇంటర్ బోర్డ్. ఎగ్జామ్ ఫీజు చెల్లింపునకు మరో 20 రోజులను గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఇంటర్ ఎగ్జామ్ ఫీజును చెల్లించడానికి ఈ నెల 24ను ఆఖరి తేదీ. అయితే, కరోనా నేపథ్యంలో కాలేజీలు మూతబడడంతో ఎగ్జామ్ ఫీజు గడువును ఫిబ్రవరి 4 వరకు పొడిగించింది. విద్యార్థులు ఎలాంటి లేట్ ఫీజు లేకుండా ఆ తేదీ వరకు ఫీజులు చెల్లించే ఛాన్స్ కల్పించింది.