తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిలయిన విద్యార్థుల విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్ చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. దీంతో పాటు మరో రెండు గూడ్ న్యూస్ లను మంత్రి ఇంటర్ విద్యార్థులకు చెప్పారు.
ఎవరైనా ప్రభుత్వం కేటాయించిన కనీస మార్కులతో సంతృప్తి చెందకుంటే వారికి మార్కులను పెంచుకునేందుకు మరో ఛాన్స్ ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. త్వరలో నిర్వహించనున్న ఇంటర్ సెకండియర్ పరీక్షలతో పాటు ఫస్ట్ ఇయర్ కు సంబంధించి ఇంప్రూవ్ మెంట్ ఎగ్జామ్స్ సైతం రాసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు మంత్రి నిన్న ప్రకటించారు.
చాలా మంది విద్యార్థులు ఫెయిల్ కావడంతో రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్ కోసం ఫీజులు సైతం చెల్లించారు. అయితే వారికి కూడా మంత్రి సబితారెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఒక వేళ ఆయా విద్యార్థులు ప్రభుత్వం కేటాయించిన కనీస మార్కులతో సంతృప్తి చెందితే వారు చెల్లించిన ఫీజులను తిరిగి ఇచ్చేస్తామన్నారు. ఒక వేళ కావాలనుకుంటే రీ కౌంటింగ్, రీవాల్యుయేషన్ చేయించుకోవచ్చన్నారు. అయితే విద్యార్థులు ఇంటర్ బోర్డుకు ఆయా వివరాలను తెలపాలని మంత్రి సూచించారు.
దీంతో స్పందించిన సీఎం కేసీఆర్ ఫెయిలయిన విద్యార్థులందరినీ పాస్ చేయాలని నిర్ణయించారు. సీఎం ఆదేశాలతో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం సాయంత్రం ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన చేశారు. త్వరలో నిర్వహించనున్న ఇంటర్ సెకండియర్ పరీక్షలకు విద్యార్థులు ఒత్తిడితో హాజరు కాకుడదన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
పాస్ పర్సంటేజ్ తక్కువగా నమోదు కావడంలో ఇంటర్ బోర్డు నుంచి ఎలాంటి పొరపాటు లేదని మంత్రి తెలిపారు. ప్రతిపక్షాలు అనవసరంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. సెకండియర్ పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. అప్పుడు కూడా తమను పాస్ చేస్తారని విద్యార్థులు భావించవద్దన్నారు.
ఆన్లైన్ క్లాసులు సరిగా నిర్వహించలేదన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఎప్పటికప్పుడు లెక్చరర్లు విద్యార్థులతో టచ్ లోనే ఉన్నారన్నారు. విద్యార్థులంతా పరీక్ష ఫెయిల్ కాగానే బోర్డు ముందు ధర్నా చేయకుండా.. తాము ఎందుకు ఫెయిల్ కావాల్సి వచ్చిందో ఆలోచించుకోవాలని సూచించారు. విద్యార్థులంతా కష్టపడి చదివి సెకండియర్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని మంత్రి కోరారు.