తెలంగాణలో వేసవి సెలవుల అనంతరం ఈ నెల 13న సోమవారం స్కూళ్లను తిరిగి ప్రారంభించనున్నట్లు గతంలో విద్యాశాఖ ప్రకటించింది. అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్య శాఖ ప్రకటనల నేపథ్యంలో సెలవులను మరికొన్ని రోజులు పొడిగిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.
దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారిక ప్రకటన కోసం ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తాజాగా కీలక ప్రకటన చేశారు. సెలవులు పొడిగిస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదని ఆమె కొట్టి పారేశారు. ముందుగా ప్రకటించిన విధంగానే ఈ నెల 13న అంటే సోమవారం నుంచి స్కూళ్లు ప్రారంభం అవుతాయని మంత్రి సబితా స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. జూలై 1 నుంచి విద్యార్థులకు రెగ్యులర్ పాఠాలను బోధించాలని నిర్ణయించింది. ఇక ఈ నెల 13వ తేదీ నుంచి 30 వరకు బ్రిడ్జికోర్సును నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. బ్రిడ్జికోర్సులో భాగంగా పై తరగతులకు ప్రమోట్ అయిన విద్యార్థి, కింది తరగతుల్లో చదివిన ముఖ్యమైన పాఠ్యాంశాలను ఈ రోజుల్లో చదవాల్సి ఉంటుంది. బ్రిడ్జి కోర్సులో భాగంగా డిజిటల్ పాఠ్యాంశాలతో పాటు, ముఖాముఖి తరగతులు రెండింటిని నిర్వహించనున్నారు.
ఈ కోర్సు కోసం ఒకటి, రెండు తరగతులను మినహాయించి, 3 నుంచి 10వ తరగతి వరకు నాలుగుస్థాయిలుగా విభజించారు. నాలుగు లెవల్స్‌గా విభజించి, రోజుకు ఆరు పీరియడ్స్ చొప్పున విద్యార్థులు గతంలో చదివిన పాఠ్యాంశాల్లోని ముఖ్యమైన పాఠ్యాంశాలు బోధిస్తారు. తరగతుల వారిగా బోధించాల్సిన పాఠ్యాంశాల షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారులు శుక్రవారం విడుదల చేశారు. టీశాట్ విద్యచానల్ ద్వారా డిజిటల్ పాఠ్యాంశాలు కొనసాగుతాయని ప్రకటనలో పేర్కొన్నారు. జులై1వ తేదీ నుంచి టీచర్లు ఆయా పాఠ్యాంశాలను తరగతి గదిలోనే బోధిస్తారని అధికారులు తెలిపారు.
ఇక రాష్ట్రంలో కరోనా కేసుల విషయానికి వస్తే.. తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయని, వారం రోజుల్లో 56 శాతం అధికంగా నమోదయ్యాయని, పాజిటివ్ రేటు 0.17 నుంచి 1.47 శాతానికి చేరిందని ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు తాజాగా తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అధికం ఒమైక్రాన్ ఉప వేరియంట్లు బీఏ4, బీఏ 5వేనని పేర్కొన్నారు. నెల రోజుల్లో 65 శాతం పాజిటివ్‌లు ఈ వేరియంట్లవేనని వివరించారు. అయితే ప్రజలెవరూ ఈ కేసుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
కానీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాలకు వెళ్తే మాస్కులు ధరించాలని సూచించారు. ప్రస్తుత కేసుల్లో జ్వరం, తలనొప్పి, పొడిదగ్గు, ముక్కు కారడం వంటి లక్షణాలున్నట్లు గుర్తించామని చెప్పారు. ఈ లక్షణాలుంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలని సూచించారు. IMP)ఈ నెల 13 నుంచి విద్యా సంస్థలు తెరుచుకుంటున్నాయని, తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని డీహెచ్ సూచించారు. ముఖ్యంగా 12-15 ఏళ్ల పిల్లలకు టీకా ఇప్పించాలన్నారు.
ఈ మేరకు ఇప్పటికే విద్యా శాఖకు సూచనలు చేసినట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు కూడా ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. టీకా పొందని పిల్లలను గుర్తించి, తమకు సమాచారం ఇస్తే పాఠశాలలోనే ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి పంపిణీ చేస్తామని వెల్లడించారు. టీకా విషయంలో తల్లిదండ్రులు అపోహలకు లోను కావద్దన్నారు. వానకాలం సీజనల్ వ్యాధు లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. కొవిడ్‌కు, సీజనల్ వ్యాధులకు మధ్య తేడాలు గుర్తించాలని సూచించారు.