దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సారి వ్యాప్తి ఎక్కువగా ఉన్నా.. వైరస్ ప్రభావం మాత్రం అంతగా ఉండడం లేదని వైద్యులు చెబుతున్నారు. వైరస్ సోకిన వారిలో అనేక మందికి నాలుగైదు రోజుల్లోనే నెగటివ్ వస్తోంది. దీంతో ప్రజల్లోనూ కరోనా అంటే భయం బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులను పొడిగిస్తుందా? లేదా? అన్న అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో సంక్రాంతి సెలవులను ఈ నెల 31 వరకు పొడిగించింది తెలంగాణ సర్కార్. అయితే.. సెలవులు ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి వరకు కేసుల నమోదులో పెరగడం తప్ప తగ్గుదల ఏ మాత్రం కనిపించలేదు. అయితే.. ఈ సమయంలో విద్యాసంస్థల ప్రారంభంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.(ప్రతీకాత్మక చిత్రం)
అయితే.. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా స్కూళ్లను సాధ్యమైనంత త్వరగా తిరిగి ప్రారంభించాలని విద్యావేత్తలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కూడా అధికారులను, మంత్రులను కలిసి ఈ మేరకు వినతి పత్రం కూడా అందించారు. రెండేళ్లుగా రాష్ట్రంలో విద్యావ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నదని వారు మంత్రుల దృష్టికి తీసుకుపోతున్నారు. క్లాసులు జరగకపోవడం, ఎగ్జామ్స్ లేకపోవడం విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారు చెబుతున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
ప్రభుత్వం కూడా విద్యాసంస్థలను త్వరగా తెరవాలనే భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వైద్య శాఖ నుంచి నివేదికను కోరారు. అయితే.. అన్ని క్లాసులను ఒకే సారి కాకుండా దశల వారీగా పరిస్థితులను బట్టి ఆయా క్లాసుల వారికి తరగతులను ప్రారంభించాలన్నది సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది. ఇందులో భాగంగా 8, 9, 10 తరగతులతో పాటు ఆపై చదువులకు ప్రత్యక్ష తరగతులను ప్రారంభించాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం.(ప్రతీకాత్మక చిత్రం)
ఫిబ్రవరి 15 నాటికి దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పడిపోతాయని వైద్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలోగా దశల వారీగా అన్ని తరగతులు ప్రారంభించేలా విద్యా శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. అనంతరం త్వరితగతిన సిలబస్ పూర్తి చేసి ఎలాగైన ఎగ్జామ్స్ నిర్వహించాలని భావిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించనట్లు సమాచారం. ఈ నివేదికను మంత్రి సబితారెడ్డి సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లనున్నారు. సీఎం అనుమతితో అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నారు. దీంతో రాష్ట్రంలో ఈ నెల 31 నుంచి విద్యా సంస్థలు తిరిగి తెరుచుకోవడం ఖాయమని అధికారులు చెబుతున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఈ నేపథ్యంలో వైద్యశాఖతో సమన్వయంతో టీచర్లకు బూస్టర్ డోస్ అందించే కార్యక్రమాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తుంది. ఇందు కోసం స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించనున్నారు. జనవరి 31 నాటికి మెజారిటీ టీచర్లకు బూస్టర్ డోస్ అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.(ప్రతీకాత్మక చిత్రం)