తెలంగాణలో రేపటి నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ సారి ఫీజులు పెరుగుతాయా? లేదా? అన్న ఉత్కంఠ విద్యార్థుల్లో నెలకొంది. ఆ విద్యార్థులకు, తల్లిదండ్రులకు శుభవార్త. ఈ ఏడాది ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు ఇక లేనట్లే అని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు సైతం ఒకటి రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ ఏడాది కూడా పాత ఫీజులనే కొనసాగించాలని Admission and Fee Regulatory Committee, Telangana (TAFRC) ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు పంపించింది. ఈ ప్రతిపాదనలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం ఆమోదించారు. ఇందుకు సంబంధించిన ఫైల్ ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆఫీస్ కు పంపించారు అధికారులు. (ప్రతీకాత్మక చిత్రం)
ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయనుంది. 2019లో పెంచిన ఫీజులు 2022 వరకు అమలులో ఉండనున్నాయి. 2022–23 నుంచి కొత్త ఫీజులు అమలు కావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఎఫ్ఆర్సీ కసరత్తు చేసింది. కాలేజీల ఆడిట్ నివేదికలను పరిశీలించడంతో పాటు యాజమాన్యాలతో సంప్రదింపులు చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇదిలా ఉంటే.. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్ (TS EAMCET Counselling) షెడ్యూల్ను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2022 ఆగస్టు 21న ప్రారంభమై, ఆగస్టు 29న ముగుస్తుంది. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకుఆగస్టు 23- 30 మధ్య సర్టిఫికేషన్ వెరిఫికేషన్ (Certificate Verification) ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)