తెలంగాణలో ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాలు తీవ్ర వివాదానికి దారితీశాయి. కేవలం 49 శాతం మాత్రమే పాస్ అయ్యారు. దీంతో ఫెయిలయిన విద్యార్థులు కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యమే ఇందుకు కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు విద్యార్థి సంఘాలు బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఆయా సంఘాలు ఆందోళనలకు దిగాయి.(ప్రతీకాత్మక చిత్రం)
తాజాగా NSUI ఇంటర్ బోర్డ్ వైఖరికి నిరసనగా ఈ రోజు అంటే సోమవారం(డిసెంబర్ 20) ఇంటర్ కాలేజీల బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ కాలేజీలు మూతబడనున్నాయి. అయితే.. NSUI మాత్రమే కాకుండా ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ తదితర సంస్థలు సైతం ఇప్పటికే ఇంటర్ బోర్డు వైఖరికి నిరసనగా ఆందోళనకు దిగాయి. ఫెయిలయిన విద్యార్థులను కనీస మార్కులతో డిమాండ్ చేయాలన్న డిమాండ్ ఆయా సంఘాల నుంచి వ్యక్తమవుతోంది.(ప్రతీకాత్మక చిత్రం)
ఇదిలా ఉంటే.. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయినవారు, ఇంప్రూవ్మెంట్ రాయాలనుకునేవారు 2022 ఏప్రిల్‌లో జరిగే వార్షిక పరీక్షలకు హాజరు కావొచ్చని తెలంగాణ ఇంటర్ బోర్డ్ సెక్రెటరీ సయ్యద్ ఒమర్ జలీల్ అధికారికంగా ప్రకటించారు. ఇంటర్ ఫలితాలపై తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని జలీల్ తెలిపారు. 70 శాతం సిలబస్ తగ్గించడంతో పాటు, ప్రశ్నల్లో ఛాయిస్ పెంచి ఈ ఎగ్జామ్స్ నిర్వహించామని క్లారిటీ ఇచ్చారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఫలితాలపై అనుమానాలు ఉన్నవారు రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రీ-వెరిఫికేషన్ ఫీజును కూడా రూ.100 నుంచి రూ.50కి తగ్గించినట్లు చెప్పారు. విద్యార్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని తెలిపారు. పరీక్షల ఫలితాలపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని సయ్యద్ ఒమర్ జలీల్ చెప్పారు.(ప్రతీకాత్మక చిత్రం)
వాస్తవానికి గత మార్చిలో నిర్వహించాల్సిన ఇంటర్ పరీక్షలను కరోనా నేపథ్యంలో ఇంటర్ బోర్డ్ నిర్వహించలేదు. సెకండియర్ విద్యార్థులను పరీక్షలు లేకుండానే పాస్ చేసింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థులను పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్ చేసింది. దీంతో చాలా మంది విద్యార్థులు తమకు ఇక ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉండవని భావించారు. అయితే ఇంటర్ సెకండియర్ తరగతులు జరుగుతున్న సమయంలో ఇంటర్ బోర్డ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ను నిర్వహించింది.(ప్రతీకాత్మక చిత్రం)
పరీక్షల నిర్వహణపై బోర్డుపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కొందరు పేరెంట్స్ కోర్టుకు కూడా వెళ్లారు. అయితే కోర్టు కూడా పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపింది. ఫలితాల్లో అత్యంత తక్కువ పాస్ పర్సంటేజ్ నమోదు కావడంతో మరో సారి ఇంటర్ బోర్డ్ పై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సబ్జెక్టుల్లో 90 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు కూడా మరికొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారని ఇందుకు ఇంటర్ బోర్డు నిర్లక్ష్యమే కారణమని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)