ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’ ( Hon Hai Fox Conn) సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ (Young Liu) నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో ప్రగతి భవన్ లో గురువారం సమావేశమైంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్ కాన్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది.
సీఎం కేసీఆర్ ధన్యవాదాలు: అంతర్జాతీయంగా అనేక దేశాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగ ముఖ చిత్రాన్ని గుణాత్మకంగా మార్చిన గొప్ప సంస్థ ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’ తమ ఉత్పత్తి కార్యకలాపాలకు తెలంగాణ రాష్ట్రాన్ని గమ్యస్థానం గా ఎంచుకోవడం పట్ల ఆ సంస్థకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఫాక్స్ కాన్ సంస్థ భవిష్యత్తు విస్తరణ ప్రణాళికల పైన కూలంకషంగా చర్చించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఫాక్స్ కాన్ సంస్థ కార్యకలాపాలకు అన్ని రకాల సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని సిఎం కేసీఆర్ ఈ సందర్భంగా చైర్మన్ యంగ్ ల్యూ కి హామీ ఇచ్చారు. తెలంగాణ స్వరాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించి భారీగా పెట్టుబడును రప్పించడంలో తమ ప్రభుత్వం విజయవంతమైందని సిఎం అన్నారు.
ఈ కార్యక్రమంలో... రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కెటి రామారావు, వైద్యారోగ్యం, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపీ అంజనీ కుమార్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సిఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి, డైరక్టర్ ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపురి తదితరులు పాల్గొన్నారు.