ఆంధ్రప్రదేశ్ లో కరోనా పంజా కారణంగా ఇంటర్, పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. అందర్నీ పాస్ చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే మరి విద్యార్థులకు మార్కులు ఎలా కేటాయిస్తారు.. పదో తరగతి విద్యార్థులకు ఏ ప్రతిపాదకను మార్కులు ఇస్తారు.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకెండ్ ఇయర్ విద్యార్థుల పరిస్థితి ఏంటి..?
ఇప్పటికే ఫలితాలు ప్రకటించడంపై అనుసరించాల్సిన విధివిధానాలను రూపొందించడానికి విశ్రాంత ఐఏఎస్ అధికారిణి ఎం.ఛాయారతన్ చైర్‌పర్సన్‌గా ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. గురువారమే ఉత్తర్వులు కూడా ఇచ్చింది ప్రభుత్వం. ఈ కమిటీకి ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి కేన్వీనర్గా వ్యవహరిస్తారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి, ప్రకాశం జిల్లా డీఈవో సుబ్బారావు సభ్యులుగా ఉంటారు. వీరితోపాటు కమిటీలో మరో ఆరుగురు నిపుణులను నియమించారు.
ఫలితాల విడుదలకు గాను విద్యార్థులకు మార్కులు ఎలా కేటాయించాలన్న అంశంపై ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి ఛాయరతన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటి ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. మరో రెండు, మూడు రోజుల్లో తమ నివేదికను ప్రభుత్వానికి అందించాలని భావిస్తోంది. ఆ కమిటీ సూచనలు ఆధారంగా త్వరగానే ఫలితాలు ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది.
అందరికీ అర్హత మార్కులను ఇచ్చి పాస్ చేయడమా.. లేక కరోనా తగ్గిన తర్వాత పరీక్షలను నిర్వహించి మార్కులు కేటాయించాలన్న అన్న అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే తెలంగాణలో లాగా ప్రస్తుతానికి ఫలితాలను విడుదల చేయకుండానే విద్యార్థులందరినీ ప్రమోట్ చేసే అవకాశం ఉంది. అతి త్వరలో ఈ అంశాలపై అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.