నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణలో త్వరలో కొలువుల జాతరకు తెరలేవనుంది. ఆ రాష్ట్ర రిక్రూట్మెంట్ బోర్డ్ టీఎస్పీఎస్సీ(తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్) ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో గ్రూప్-2, గ్రూప్ -3, గ్రూప్-4 పోస్టులను భారీగా భర్తీ చేయనుంది. ఈ మేరకు డిసెంబర్లో నోటిఫికేషన్స్ జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది.
గ్రూప్ -IIలో 726 పోస్టులు, గ్రూప్-IIIలో 1373 పోస్టులు, గ్రూప్-IVలో అత్యధికంగా 9,168 పోస్టుల భర్తీ చేసేందుకు వచ్చే నెలలో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్స్ జారీ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రూప్ II, III, IV సర్వీసెస్‌లో కొత్త పోస్టులను యాక్ చేసింది. దీంతో గ్రూప్-III సర్వీసెస్‌లో మరిన్ని ఖాళీలు పెరిగే అవకాశం ఉంది.
* జీవో సవరణతో పెరిగిన పోస్టులు : జీఓ నెం.55కు తెలంగాణ సర్కార్ ఇటీవల సవరణ చేసింది. దీంతో గ్రూప్-2లో కొత్తగా ఆరు పోస్టులు, గ్రూప్-3 సర్వీసుల్లో రెండు కేటగిరీల పోస్టులు, గ్రూప్-IV సర్వీసుల్లో నాలుగు కేటగిరీల పోస్టులను కొత్తగా చేర్చారు. జీఓ నెం.55 సవరణ కంటే ముందే గ్రూప్-2లో 663 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించింది.
* త్వరలో మరిన్ని పోస్టులకు క్లియరెన్స్ : మొత్తం 80,039 పోస్టుల భర్తీకి ఇప్పటి వరకు ఆర్థిక శాఖ 61,804 పోస్టులను భర్తీ చేయడానికి పచ్చ జెండా ఊపింది. ఇక, మిగిలిన 18,235 ఖాళీలకు సంబంధించి త్వరలో క్లియరెన్స్ లభిస్తుంది. కాగా, గతంలో గ్రూప్-2, గ్రూప్-4 నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ 2015లో విడుదల చేసింది. ఆ సమయంలో గ్రూప్-2 కింద 1032 పోస్టులు, గ్రూప్-4 కింద 1521 పోస్టులను భర్తీ చేసింది.
* నేటి నుంచి కీలక భేటీలు : నోటిఫికేషన్ జారీ ప్రక్రియను వేగవంతం చేసి, నియామకాలను త్వరగా చేపట్టేందుకు TSPSC వివిధ శాఖల అధికారులతో వరుస సమావేశాలను నిర్వహించనుంది. ఈ క్రమంలో గ్రూప్- IV రిక్రూట్మెంట్కు సంబంధించి సుమారు 30 విభాగాలతో TSPSC చైర్మన్ డాక్టర్ బి జనార్దన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్ నేడు (సోమవారం) సమావేశం కానున్నారు.
* రోస్టర్ పాయింట్స్, రిజర్వేషన్‌పై చర్చ : విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. గ్రూప్ II, III, IV సర్వీసెస్ లో రిక్రూట్మెంట్కు సంబంధించిన రోస్టర్ పాయింట్స్, ఇండెంట్స్, రిజర్వేషన్ తదిర విషయాలపై టీఎస్పీఎస్సీ వివిధ శాఖల అధికారులతో సుదీర్ఘంగా చర్చించనుంది. వచ్చే మూడు నాలుగు రోజుల్లో దాదాపు 94 శాఖలతో సమావేశాలు నిర్వహించనుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో వారం రోజులు పట్టవచ్చు. డిసెంబర్లో నోటిఫికేషన్స్ విడుదలయ్యే అవకాశం ఉంది.