* కార్డియాక్, యాంటీ-డయాబెటిక్ డ్రగ్స్‌పై ట్రేడ్ మార్జిన్ల తగ్గింపు : ట్రేడ్ మార్జిన్లను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం మందుల జాబితాతో సిద్ధంగా ఉంది. తయారీదారులు వర్తకం చేసే ధర, రోగులు చెల్లించే గరిష్ట రిటైల్ ధర (MRP) మధ్య వ్యత్యాసాన్ని ట్రేడ్ మార్జిన్ అంటారు. దాదాపు 60 కార్డియాక్, హైపర్‌టెన్షన్, యాంటీ డయాబెటిక్, నరాలవ్యాధి నొప్పి, మూర్ఛ, విటమిన్ B12 సప్లిమెంట్లకు సంబంధించిన మెడిసిన్స్‌పై ట్రేడ్ మార్జిన్ తగ్గే అవకాశం ఉంది. స్థూల అంచనాల ప్రకారం.. 5,000 కంటే ఎక్కువ బ్రాండ్ల మందులను ట్రేడ్ మార్జిన్ ప్రభావితం చేసే అవకాశం ఉంది.
* 75వ స్వాతంత్ర్య దినోత్సవం- ప్రత్యేక మెడల్స్ : భారత స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15న ప్రత్యేక మెడల్స్‌ను సాయుధ దళాలు, సాయుధ పోలీసు బలగాలకు కేంద్ర ప్రభుత్వం అందజేసింది. ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి ఇటువంటి పతకాలను అందజేయడం అనవాయితీ. బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 1997 ఆగస్టు 15న వీటిని చివరిగా అందించారు. ఈకొత్త మెడల్ ముందు భాగంలో అశోక సింహం, వెనుక భాగంలో అశోక చక్రం ఉంటుంది.
* సల్మాన్ రష్దీపై దాడి : వివాదాస్పద రచయిత సల్మాన్ రష్దీపై గత శుక్రవారం దాడి జరిగింది. తాను రాసిన ‘‘ది సాటానిక్ వెర్సెస్’’పై ముస్లింలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై అనేక సార్లు రష్దీకు బెదిరింపులు వచ్చాయి. పశ్చిమ న్యూయార్క్ రాష్ట్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న రష్డీపై న్యూజెర్సీకి చెందిన 24ఏళ్ల వ్యక్తి కత్తితో పలుమార్లు పొడిచాడు. దీంతో తీవ్ర ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న అతన్ని అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దుండగుడి దాడిలో రష్దీ చేతి నరాలు పూర్తిగా తెగిపోయాయి. అతని కాలేయం పూర్తిగా కత్తిపోట్లకు గురైందని రష్దీ ఏజెంట్ ఆండ్రూ వైలీ తెలిపారు.
* ఎన్డీఏకు నితీష్ కుమార్ గుడ్‌బై.. : జనతాదళ్(యు) నేత, బీహార్ సీఎం నితీష్ కుమార్.. కేంద్రానికి షాక్ ఇచ్చారు. ఆయన ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగారు. తన సీఎం పదవికి కూడా రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీల సహాయంతో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీహార్ సీఎంగా గత బుధవారం మరోసారి ప్రమాణస్వీకారం చేశారు.