సంక్రాంతి సెలవులు ముగిశాయి. ఇక పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఫిబ్రవరి నెల ప్రధానంగా విద్యార్థులకు కీలకం కానుంది. సీబీఎస్ఈ, మహారాష్ట్ర సెకండరీ బోర్డు పరీక్షలు ఈ నెలలోనే జరగనున్నాయి. మరోవైపు, చార్టెడ్ అకౌంటెంట్ ఫౌండేషన్ ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో ముఖ్యమైన అకాడమిక్ ఈవెంట్స్ ఏంటో తెలుసుకుందాం.
* నీట్ యూజీ రిజిస్ట్రేషన్లు(NEET UG REGISTRATIONS) : 2023 నీట్ అండర్ గ్యాడ్యుయేట్ రిజిస్ట్రేషన్లు ఈ వారంలోనే ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే, దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసే సూచనలున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఇప్పటికే యూజీ పరీక్షా తేదీని ప్రకటించేసింది. ఈ ఏడాది మే 7న పరీక్షను నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. ఈ మేరకు త్వరలోనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉంది.
* మహారాష్ట్ర బోర్డ్ పరీక్షలు(MSBSHE EXAMS) : మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హైయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్(MSBSHE).. 2022-23 వార్షిక పరీక్షల షెడ్యూల్‌ని ప్రకటించింది. 12వ తరగతి పరీక్షలను ఈ నెల 21 నుంచి ప్రారంభించనుంది. మార్చి 21 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు పదో తరగతి పరీక్షలు మార్చి 2న ప్రారంభమై 25వరకు కొనసాగనున్నాయి.
* సీఏ ఫౌండేషన్ ఫలితాలు(CA FOUNDATION RESULTS) : 2022లో నిర్వహించిన సీఏ ఫౌండేషన్ పరీక్షల ఫలితాలు ఈ నెలలో విడుదల కానున్నాయి. ఫిబ్రవరి 3 లేదా ఫిబ్రవరి 4న ‘ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI)’ ఫలితాలను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ICAI అధికారిక వెబ్సైట్ icai.orgకి వెళ్లి రిజల్ట్స్‌ని చూసుకోవచ్చు.
* CUET నోటిఫికేషన్ : సెంట్రల్ యూనివర్సిటీల్లో యూజీ ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్(CUET) పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి నెలలోనే ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఎగ్జామినేషన్ షీట్ ప్రకారం మే 21 నుంచి ఈ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలు ప్రారంభమవుతాయి. జూన్ 7 వరకు కొనసాగనున్నాయి.