ప్రధాన అకడమిక్ పరీక్షలకు (Exams) నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో విద్యార్థులు బోర్డు పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రిపరేషన్ కావడానికి సమయం తక్కువగా ఉంది. దీంతో పూర్తి సిలబస్ చదవడానికి సరైన ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్, సరైన షెడ్యూలింగ్‌తో పరీక్షలకు సన్నద్ధమైతే మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంది. వీటితో పాటు మరికొన్ని టిప్స్ (Exam Tips) పాటిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు.
ప్లానింగ్ అండ్ టైం మేనేజ్మెంట్
విద్యార్థులు పరీక్షల కోసం మొత్తం సిలబస్ చదవాల్సి ఉంటుంది. దీంతో వర్క్‌లోడ్ పెరిగి మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. దీన్ని నివారించాలంటే ప్రిపరేషన్‌కు సరైన ప్రణాళికలు వేసుకోవాలి. దీంతో పాఠ్యాంశాల్లో వేటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలో తెలుస్తుంది. వాటికి అనుగుణంగా సమయం కేటాయించడానికి వీలు కలుగుతుంది.
ఫేన్మాన్ టెక్నిక్
ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, తత్వవేత్త, రచయిత అయిన రిచర్డ్ ఫేన్మాన్.. తాను ప్రిన్స్టన్ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో ఈ టెక్నిక్‌ను డెవలప్ చేశారు. క్లిష్టమైన భావనలను అర్థం చేసుకోవడానికి ఈ టెక్నిక్‌ను విస్తృతంగా అనుసరిస్తున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే ప్రాథమికంగా పాఠాలను విడగొట్టి ఎక్కడ మనకు అర్థం కావడం లేదో గుర్తించి వాటిని పరిష్కరించడమే ఫేన్మాన్ టెక్నిక్ ఉద్దేశం.
ఫ్లాష్ కార్డ్స్
తక్కువ సమయంలో ఎక్కువ కాన్సెప్ట్‌లు గుర్తుంచుకోవడానికి ఈ పద్దతి బెస్ట్. దీన్ని ఉపయోగించి మనకు మనమే టెస్ట్ చేసుకోవచ్చు. ముందుగా ఒక పేపర్ తీసుకొని దానిపై అంశాన్ని రాయండి. వెంటనే పేపర్ వెనుకవైపు ఆ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు రాయండి. ఇలా సాధన చేయడాన్ని ఫ్లాష్ కార్డ్ కాన్సెప్ట్ అంటారు.
కార్నెల్ నోట్‌టేకింగ్ సిస్టమ్
ఈ టెక్నిక్‌ను 1950లో కార్నెల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ వాల్టర్ పాక్ డెవలప్ చేశారు. పాఠాలు వినే సమయంలో నోట్ పక్కన ఖాళీ కాలమ్‌ను ఉంచుతూ యాక్టివ్ నోట్-టేకింగ్‌ను ప్రోత్సహిస్తుంది. ఈ కాలమ్ వల్ల తరువాత మరోసారి సమాచారాన్ని గ్రహించడానికి, తిరిగి రివైజ్ చేసుకోవడానికి స్వయంగా విద్యార్థులే టెస్ట్ చేసుకోవచ్చు.