ప్రాథమిక రాతపరీక్షలో మెరిట్ ఆధారంగా దేహదారుఢ్య పరీక్షకు అనుమతించాలని పోలీసు నియామక బోర్డును ఆదేశించింది హైకోర్టు. ఈమేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్, డీజీపీకి నోటీసులు జారీచేసింది. కౌంటరు దాఖ చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.
హోంగార్డు అభ్యర్థుల తరఫున న్యాయవాది జి.శీనకుమార్ వాదనలు వినిపించారు. కటాఫ్ మార్కుల విషయంలో సాధారణ అభ్యర్థులతో సమానంగా హోంగార్డులను పరిగణించడం సరికాదన్నారు. కటాఫ్ మార్కులతో సంబంధం లేకుండా హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని కోర్టును కోరారు. దేహదారుఢ్య పరీక్షకు అనుమతించేలా ఆదేశాలివ్వాలన్నారు.
కౌంటర్ దాఖలుకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ అంశంపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వవద్దని కోరారు. వాదనల తర్వాత న్యాయమూర్తి హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని ఆదేశాలు జారీ చేశారు. కటాఫ్ మార్కులతో సంబంధం లేకుండా హోంగార్డు అభ్యర్థుల ప్రాథమిక రాతపరీక్షలో మెరిట్ ఆధారంగా పిటిషనర్లను దేహదారుఢ్య పరీక్షకు అనుమతించాలని ఆదేశించారు.