కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ఎప్పుడు ఏ పరీక్ష ఉంటుందో? ఎప్పుడు వాయిదా పడుతుందో తెలియని పరిస్థి ఉండేది? అయితే.. ఈ ఏడాది వైరస్ ప్రభావం బాగా తగ్గడంతో పరీక్షలన్నీ అనుకున్న సమయానికే ప్రశాంతంగా సాగుతున్నాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటికే అనేక బోర్డు పరీక్షలు పూర్తి అయ్యాయి. వాటి ఫలితాలు కూడా దాదాపుగా విడుదలయ్యాయి.
ఇప్పుడు ప్రవేశ పరీక్షల సమయం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఈఏపీసెట్-EAPCET (EAMCET-2022) పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంజనీరింగ్ కు సంబంధించి జులై 4 నుంచి 8వ తేదీ వరకు.. బైపీసీ వారికి 11 నుంచి 12 వరకు ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు అధికారులు.
ఇందుకు సంబంధించి ఉన్నత విద్యామండలి విద్యార్థులకు కీలక ప్రకటన జారీ చేసింది. విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 7.30 గంటలు, మధ్యాహ్నం 1.30 గంటల నంచే అనుమతిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించి సమయానికంటే ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. హాల్ టికెట్ తో పాటే పరీక్షా కేంద్రం రూట్ మ్యాప్ వస్తుందన్నారు.
అభ్యర్థులు ఫొటో కలిగిన గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలన్నారు. ఇంకా ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు పరీక్షా కంద్రాల వద్దనే తమ కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు ఏమైనా సందేహాలుంటే.. 08554-234311, 232248 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఇదిలా ఉంటే ఈ సారి ఎపాసెట్ (EAMCET) ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.