కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా విద్యావ్యవస్థ కుంటుపడిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఏడాది వైరస్ ప్రభావం తగ్గడంతో పరీక్షలన్నింటినీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించారు అధికారులు. ఇందుకు సంబంధించిన ఫలితాలను సైతం సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలో టెన్త్ ఎగ్జామ్స్ కు సంబంధించిన ఫలితాలను జూన్ 10లోగా విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన మూల్యాంకన ప్రక్రియ ముగియడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థుల కోసం జులై లో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ను నిర్వహించే అవకాశం ఉంది. జులై 2వ వారంలో ఇందుకు సంబంధించిన పరీక్షలు ఉండే అవకాశం ఉంది.
ఇంటర్ ఎగ్జామ్స్ కు సంబంధించిన ఫలితాలను జూన్ చివరి వారంలో విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డ్ యోచిస్తోంది. ఫలితాలు విడుదల చేసిన నెల రోజులకు ఈ ఎగ్జామ్స్ ఉండనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డ్ కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలు జులై 1 నుంచి ప్రారంభించేందుకు ఇంటర్ బోర్డ్ యోచిస్తోంది.
ఇదిలా ఉంటే.. తెలంగాణలో ఈ నెల 24న ఇంటర్ పరీక్షలు ముగిసన విషయం తెలిసిందే. అయితే.. ఓ వైపు పరీక్షలు జరుగుతుండగానే మరో వైపు ఈ నెల 12న వాల్యుయేషన్ ను సైతం ప్రారంభించింది ఇంటర్ బోర్డ్. గతంలో ఇంటర్ ఫలితాల విషయంలో గందరగోళం నెలకొనడం, విద్యార్థులు ఆందోళనలకు దిగిన నేపథ్యంలో అలాంటి ఘటనలకు ఆస్కారమే ఇవ్వకూడదన్న లక్ష్యంతో ఇంటర్ బోర్డ్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
ఇంటర్ ఫలితాలను జూన్ 10న విడుదల చేయాలన్న లక్ష్యంతో ఇంటర్ బోర్డ్ పని చేస్తోంది. కాగా.. 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ షెడ్యూల్ ను సైతం ఇంటర్ బోర్డ్ ఖరారు చేసింది. మొత్తం 221 వర్కింగ్ డేస్ తో కూడిన షెడ్యూల్ ను ఇంటర్ బోర్డ్ ఇటీవల విడుదల చేసింది. జూలై 1న ఇంటర్ ఫస్టియర్ తరగతులు ప్రారంభించనున్నట్లు ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. ఇంటర్ సెకండియర్ క్లాసులను జూన్ 15న ప్రారంభించనున్నట్లు బోర్డు తెలిపింది.