ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ ఎగ్జామ్స్ వాయిదా పడనున్నాయి. మెయిన్ ఎగ్జామ్స్ కారణంగా ఇప్పటికే ఇంటర్ ఎగ్జామ్స్ ను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే మార్చిన ఇంటర్ తేదీలు, కొన్ని టెన్త్ పరీక్షలు ఒకే తేదీన వస్తున్నాయి. దీంతో పోలీస్ బందోబస్తు, హెల్త్ సిబ్బంది, ఎగ్జామ్ సెంటర్స్ తదితర ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన అధికారులు పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయించారు.
కొత్త షెడ్యూల్ కోసం అనుమతించాలని కోరుతూ ఇప్పటికే పరీక్షల విభాగం ప్రభుత్వ అనుమతి కోసం పంపించింది. దీంతో కొత్త తేదీలను ఈ నెల 14 న ప్రకటించనున్నారు. ఒక్క పూట బడులను సైతం వాయిదా వేయనున్నారు అధికారులు. వచ్చే నెలలో ఒక్కపూట బడులపై నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీలోనూ ఇంటర్ పరీక్షలను ఇటీవల అధికారులు వాయిదా వేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 22న పరీక్షలు మొదలై మే 12 వరకు జరగనున్నాయి.
టెన్త్ పరీక్షలు గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 2 నుంచి 13వ తేదీ వరకు జరగాల్సి ఉంది. 2 నుంచి 13 వ తేదీ వరకు ఎగ్జామ్స్ క్లాష్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే టెన్త్ ఎగ్జామ్స్ వాయిదా పడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఏపీ ఇంటర్మీడియట్ఎడ్యుకేషన్ బోర్డ్ (BIEAP) ఇటీవల ప్రకటించింది.
శుక్రవారం (మార్చి 11) నుంచి జరగాల్సిన ఏపీ ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ (Inter Practical Exams) వాయిదా పడ్డాయి. ఈ ఎగ్జామ్స్ కోసం సరికొత్త షెడ్యూల్ను త్వరలోనే విడుదల చేస్తామని బోర్డు తన అధికారిక వెబ్సైట్ bie.ap.gov.inలో తెలియజేసింది. అయితే మరికొద్ది రోజుల్లోనే సరికొత్త షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇంటర్ సెకండియర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ను జంబ్లింగ్ విధానంలో కండక్ట్ చేస్తామని మార్చి 3న ఏపీ ఇంటర్ బోర్డు ఉత్తర్వులిచ్చింది. అంతకు ముందు వరకు నాన్-జంబ్లింగ్ పద్ధతిలోనే పరీక్షలు నిర్వహిస్తామంటూ ఏపీ బోర్డు చెప్పుకొచ్చింది. అలా చెబుతూనే కేవలం వారం రోజుల సమయం ఉండగా... జంబ్లింగ్ విధానాన్ని అనుసరిస్తామని ప్రభుత్వం ఉన్నపళంగా ఉత్తర్వులు ఇచ్చింది.
దీనిని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టు మెట్లు ఎక్కారు. దీంతో గురువారం నాడు ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు చివరి దశలో పరీక్షల నిర్వహణా విధానాన్ని మార్చడం సరైంది కాదని అభిప్రాయపడింది. ఇలా మార్చడానికి ప్రభుత్వం వద్ద సరైన కారణం కూడా లేదని వ్యాఖ్యానించింది. ఉత్తర్వులు కొట్టివేస్తూ ఎప్పటిలాగానే పరీక్షలను యథావిధిగా నాన్-జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహించాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.