సాఫ్ట్వేర్ దిగ్గజం యాక్సెంచర్ తమ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులను తొలగిస్తోంది. భారతీయ యూనిట్ లో పని చేసే వారిపై ఈ కత్తి వేలాడుతోంది. ఇటీవల ఫేక్ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందుతున్నట్లు తెలుసుకున్న కంపెనీ.. ఇలా ధృవీకరణ పత్రాలను సమర్పించిన ఉద్యోగులను కనుగొంది. ఇలా అవకతవకలకు పాల్పడిన కొంత మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇటువంటి చర్యలు తమ కస్టమర్లకు సేవలందించే సామర్థ్యాన్ని ప్రభావితం చేయకుండా ఉండేలా తాము చర్యలు తీసుకున్నామని కంపెనీ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. నకిలీ ఉద్యోగ పోస్టింగులపై అప్రమత్తంగా ఉండాలని యాక్సెంచర్ హెచ్చరించింది. యాక్సెంచర్‌తో ఉపాధి కోసం కొంతమంది ఉపాధి సంస్థలు , వ్యక్తులు అభ్యర్థుల నుంచి డబ్బు అడుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు.
యాక్సెంచర్‌తో ఉపాధిని పొందేందుకు నిధులను సేకరించడానికి లేదా ఏదైనా ఆర్థిక ఏర్పాటును అభ్యర్థించడానికి మేము ఏ ఏజెన్సీ, కంపెనీ లేదా వ్యక్తికి అధికారం ఇవ్వలేదని కంపెనీ తెలిపింది. యాక్సెంచర్‌లో రిక్రూట్మెంట్ పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుందని పునరుద్ఘాటిస్తూ.. రిక్రూట్మెంట్ ప్రక్రియ యొక్క ఏ దశలోనూ ఎటువంటి ఫీజులను వసూలు చేయబోమని కంపెనీ ప్రకటించింది.
యాక్సెంచర్‌లో ఉద్యోగం కోసం ఎవరూ ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని బ్లాగ్ పోస్ట్ స్పష్టం చేసింది. తాము సిద్ధాంతాలు పాటిస్తామని, ఉల్లంఘించిన వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. సరైన అర్హత కలిగిన అభ్యర్థులను మాత్రమే తాము నియమించుకుంటామని, అందుకోసం ఎప్పటికప్పుడు నియామకాలు జరుగుతాయని పేర్కొంది.
అయితే.. కరోనా సమయంలో ఉద్యోగులను ఎక్కువగా నియమించుకోవాల్సి వచ్చిందని.. వారిలో చాలా మంది ఇలా ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా వచ్చారని.. ఇప్పుడు హెచ్ఆర్ లు వారి క్రెడెన్షియల్స్ చెక్ చేసే పనిలో పడ్డారని వివరించింది. కొంత కాలంగా ఐటీ రంగం తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే యాపిల్, గూగుల్, ఫేస్బుక్ మాతృసంస్థ మెటా వంటి కంపెనీలు కోట్లాది రూపాయలు నష్టపోయాయి.
ఆదాయం భారీగా తగ్గింది. దీంతో ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులను తొలగించుకుంటున్నాయి. ఇది భారత్‌పైనా ప్రభావం చూపిస్తోంది. ఇక్కడ ఐటీ కంపెనీలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. తొలుత టీసీఎస్ ఉద్యోగులకు లే ఆఫ్స్ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. తర్వాత చాలా వరకు టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు ఫ్రెషర్లకు ఆఫర్ లెటర్స్ ఇచ్చి మళ్లీ వెనక్కి తీసుకున్నట్లు కూడా మీడియాలో వార్తలొచ్చిన విషయం తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)