World population day 2021: జనాభా పెరుగుదల అత్యంత ముఖ్యమైన అంశం. ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసే అంశం. ముఖ్యంగా ఇండియా, చైనా లాంటి దేశాలకు ఇది కొన్ని ప్రయోజనాలు, కొన్ని నష్టాలను కలిగిస్తోంది. అధిక యువ శక్తితో ఇలాంటి దేశాలు అభివృద్ధిలో దూసుకుపోయేందుకు అవకాశాలు ఉన్నా... అదే అధిక జనాభా ఈ దేశాలకు భారంగా కూడా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల ఏటా పెరుగుతూనే ఉంది. అందుకే జనాభా పెరుగుదల, దాని పరిణామాలపై అవగాహన కలిగించేందుకు ప్రత్యేకించి ఓ రోజును కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి సంవత్సరం జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుతున్నారు. 1989లో ఐక్య రాజ్యసమితి ఈ రోజును ప్రారంభించింది. (ప్రతీకాత్మక చిత్రం)
11-7-1987న ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరింది. అందువల్లే ఆ రోజును ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 35 శాతానికి పైగా జనాభా... ఇండియా, చైనాలోనే ఉన్నారు. ఎప్పుడో 1850లో ప్రపంచ జనాభా 100 కోట్లను దాటింది. 2020 మార్చి నాటికి 780 కోట్లను దాటినట్లు అంచనా. వచ్చే 30 ఏళ్లలో 900 కోట్లకు చేరుతుందనే అంచనా ఉంది. అలాగే... 2055 నాటికి 1000 కోట్లకు చేరుతుందనే అంచనా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
మన దేశంలో కరోనా కారణంగా... తాజాగా జనగణన చేపట్టలేదు. 2011 లెక్కల ప్రకారం ఇండియా జనాభా... 1,21,05,69,573. ప్రస్తుతం 135 నుంచి 140 కోట్ల దాకా ఉంటుందని అంచనా ఉంది. ఐతే... 2020 జులై 9 నాటికి భారత జనాభా 1,38,02,70,828 కోట్లుగా... ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. అంటే... ప్రపంచ జనాభాలో 17.7 శాతం. 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగం మంది ఇండియా, చైనా, అమెరికా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ సహా 9 దేశాల్లో ఉంటారని అంచనా. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రపంచ జనాభా పెరిగే కొద్దీ భూమికి భారమే. కాలుష్యం నానాటికీ పెరుగుతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. నదుల ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. పట్టణీకరణ ఎక్కువవుతోంది. పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటోంది. మానవుల అత్యాశతో... భూమికి అంతా నష్టమే జరుగుతోంది. ప్రపంచ దేశాల మధ్య ఆధిపత్య పోరు పెరుగుతోంది. ఆహార కొరత ఏర్పడుతోంది. ఆకలి చావులు ఎక్కువవుతున్నాయి. వ్యవసాయంలో యంత్రాలు, పురుగు మందుల వాడకం పెరుగుతోంది. సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు రోజూ వేల టన్నులు పెరిగిపోతున్నాయి. ఇలా జనాభా పెరుగుదల వల్ల ఎన్నో నష్టాలు తప్పట్లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇండియాలో యువ జనాభా ఎక్కువే. తద్వారా ఇండియా త్వరగా అభివృద్ధి చెందేందుకు వీలవుతుంది. 2025 నాటికి జనాభాలో... భారత్, చైనాను దాటేస్తుందని అంచనా. ఇండియాలో జనాభా నియంత్రణ అమలు కచ్చితంగా లేకపోవడమే ఇందుకు కారణం. నిజానికి ప్రపంచంలో కుటుంబ నియంత్రణ పథకాలను అధికారికంగా ప్రవేశపెట్టింది ఇండియానే. 1950లోనే కోట్లు ఖర్చు చేసింది. కానీ ఫలితాలు కనిపించలేదు. ఇప్పటికైనా కుటుంబ నియంత్రణా చర్యలు కఠినంగా పాటించకపోతే... ఇండియాలో తీవ్రమైన కరవు పరిస్థితులు రావచ్చనే అంచనా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)