World Origami Day : ఏటా నవంబర్ 11న ప్రపంచ ఓరిగామి దినోత్సవం జరుపుకుంటున్నాం. కాగితం బొమ్మలకు కూడా ఒక డే ఉందా అనిపించడం సహజం. అలా ఉండటానికి చరిత్రలో జరిగిన ఓ ఘటన కారణమైంది. అదేంటో తెలుసుకుందాం. ఈ దినోత్సవాన కాగితాలతో మాత్రమే కాదు నాప్కిన్స్, బట్టలు, డాలర్ బిల్స్ ఇలా మడత పెట్టేందుకు వీలైన వాటితో బొమ్మలు తయారుచేస్తారు.
చరిత్ర : 1898 - 1992 మధ్య జీవించిన లిలియన్ ఓపెన్‌హీమెర్ జయంతి సందర్భంగా ప్రపంచ ఓరిగామి దినోత్సవం జరుపుకుంటున్నారు. లిలియన్.. అమెరికాలో తొలి ఓరిగామి గ్రూప్‌ని స్థాపించారు. బ్రిటీష్ ఓరిగామి సొసైటీ ఏర్పడేందుకు కూడా కృషి చేశారు. ప్రస్తుతం యూరప్, చైనా, జపాన్‌లో ఓరిగామి బాగా వాడుకలో ఉంది. ఐతే.. ఇంతకంటే ఎక్కువగా ఓ విషాద ఘటన ఈ రోజును ప్రభావితం చేసింది.
ఆశ : ఓరిగామిని ఆశకు ప్రతిరూపంగా భావిస్తారు. నిరాశలో ఉన్నవారు ఓరిగామి కథ తెలుసుకొని ప్రేరణ పొందుతారు. ఆ కథ ఏంటంటే.. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో.. హిరోషిమాపై అణుబాంబు దాడి జరిగిన పదేళ్ల తర్వాత.. సడాకో ససాకీ అనే బాలికకు ల్యుకేమియా వ్యాధి సోకింది. ఆస్పత్రిపాలైంది. కాగితాలతో 1000 కొంగ బొమ్మలు చేస్తే వ్యాధి తగ్గిపోతుందని ఒకరు చెప్పడంతో.. ఆ బాలిక వాటిని చెయ్యడం ప్రారంభించింది. (image credit - wikipedia)
సడాకో.. 644 కొంగ బొమ్మలను తయారుచేయగలిగింది. వాటిని చూస్తూనే ప్రాణం విడిచింది. ఈ విషయం ప్రపంచ దేశాల్ని కదిలించింది. ఎక్కడెక్కడి నుంచో బాల బాలికలు.. జపాన్ వచ్చి.. సడాకోకి నివాళులు అర్పించారు. ఇందుకోసం వారంతా కాగితం బొమ్మలు చేసి ఇచ్చారు. ఇలా ఆ బాలిక పేరు మీద హిరోషిమాలో చిల్డన్స్ పీస్ విగ్రహం ఏర్పాటు చేశారు. అందుకే ఓరిగామికి జపాన్‌లో ఎంతో గుర్తింపు ఉంది. (image credit - wikipedia)
మీ పిల్లలకు ఈ కథ చెప్పి.. వారితో కాగితపు బొమ్మలు చేయించండి. వారిలో క్రియేటివిటీని పెంచండి. మార్కెట్లో ఓరిగామి బుక్స్ లభిస్తాయి. వాటిలో రకరకాల బొమ్మలు ఎలా చెయ్యాలో చూపిస్తారు. ఆ పుస్తకాల్ని మీ పిల్లలకు కొని ఇస్తే.. వారిలో క్రియేటివిటీ పెరుగుతుంది. స్కూళ్లలో టీచర్లు కూడా ఈ దిశగా విద్యార్థుల్లో క్రియేటివిటీని పెంచవచ్చు.