బఫెలో సిటీలో జెఫర్సన్ అవెన్యూ ప్రాంతంలోని టాప్స్ ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్ వద్ద శనివారం మధ్యాహ్నం భయానక కాల్పుల ఉదంతం చోటుచేసుకుంది. మారహోమానికి ముందుగానే అన్ని రకాలుగా సిద్దమైన యువకుడు.. దుస్తుల్లో పకడ్బందీగా రెడీ అయి, హెల్మెట్, బాడీ కెమెరాల ద్వారా లైవ్ స్ట్రీమింగ్ వీడియో చేస్తూ దురాగతానికి పాల్పడ్డాడు.
నల్లవాళ్లు ఎక్కువగా నివసించే ప్రాంతం కావడంతో జెఫర్సన్ అవెన్యూను, ఆ సూపర్ మార్కెట్ ను ఎంచుకుని, తుపాకితో లోనికెళ్లిన యువకుడు.. కనిపించినవాళ్లను కనిపించినట్లే కాల్చి చంపేస్తూ ముందుకు కదిలాడు. సూపర్ మార్కెట్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న బఫెలో సిటీ మాజీ ఉత్తమ పోలీస్ ఒకరు దుండగున్ని అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. మాజీ పోలీసుతోపాటు మొత్తం 10 మందిని దుండగుడు కాల్చి చంపాడు.
అరెస్టు తర్వాత నిందితుడిని కాంక్లిన్కు చెందిన పేటన్ జెండ్రాన్ (18)గా పోలీసులు గుర్తించారు. ఆ టీనేజర్ తల్లిదండ్రులిద్దరూ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారని, ఆర్థికంగా మెరుగైన స్థితిలోనే ఉన్నారని వెల్లడైంది. కాగా, యువకుడు కొంతకాలంగా ఇంటర్నెట్ లో వైట్ సుప్రిమసీ(తెల్లవాళ్లే గొప్ప, నల్లవాళ్లు చెత్త అనే) మోటివేషన్ క్లాసులు వింటున్నాడని, జాతి వివక్షను విపరీతంగా నెత్తికెక్కించుకున్నాడని తెలుస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
జెండ్రాన్ టార్గెట్ చేసి మరీ కాల్చి చంపిన నల్ల జాతీయుల్లో నలుగురు సూపర్ మార్కెట్ ఉద్యోగులుకాగా, మిగతావారంతా కస్టమర్లు. మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న వెంటనే వైద్యపరీక్షల తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా, అతనిపై ఫస్ట్ డిగ్రీ మర్డర్ ఆరోపణలు నమోదయ్యాయి.
టీనేజర్ అయిన నిందితుడు ఇంత తీవ్ర స్థాయిలో జాత్యహంకారాన్ని ప్రదర్శించడానికి దారి తీసిన కారణాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. జెండ్రాన్ తల్లిదండ్రులు, ఇరుగుపొరుగువారినీ విచారిస్తున్నారు. ఈక్రమంలోనే అతని కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులకు అతను ఇంటర్నెట్ ద్వారానే మోటివేట్ అయినట్లు గుర్తించారు. బఫెలో కాల్పుల ఉదంతంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ విచారం వ్యక్తం చేశారు.
బఫెలో సిటీలో సామూహిక కాల్పుల ఉదంతం జరగడానికి కొద్ది గంటల ముందు, విస్కాన్సన్ రాష్ట్రంలోని మిల్వాకీ నగరంలో ఓ బాస్కెట్ బాల్ స్టేడియంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, సుమారు 20 మందికి పైగా గాయపడ్డారు. రెండు రోజుల వ్యవధిలోనే కాల్పుల ఘటనల్లో 13 మంది చనిపోవడం అమెరికాలో విచ్చలవిడి గన్ కల్చర్ కు నిదర్శనంగా నిలిచాయి.