US Presidential Election Result 2020: జో బిడెన్ అమెరికా అధ్యక్షుడు అవ్వడం కంటే... కమలా హారిస్ ఉపాధ్యక్షురాలు అవుతున్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే కమలా హారిస్ సామాన్యురాలి నుంచి అసామాన్యురాలిగా ఎదిగిన ధీర వనిత. ఎన్నో విమర్శలు, ఎన్నో సవాళ్లు... అన్నింటినీ అంతే ధైర్యంగా ఎదుర్కొంది ఆమె. జో బిడెన్ ఆమెను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంచుకోవడంతోనే... బిడెన్ సగం విజయం సాధించేశారని విశ్లేషకులు అన్నారు. నిజమేమరి... కమలా హారిస్... చరిత్రలో తనకంటూ కొన్ని సువర్ణాక్షరాలు ఆల్రెడీ లిఖించేశారు. నాలుగేళ్ల తర్వాత లేదా... 8 ఏళ్ల తర్వాత... అమెరికా అధ్యక్ష రేసులో నిలవబోయేది ఆమె. ఇంతకంటే చరిత్ర ఇంకేం సృష్టించాలి?
తల్లి భారతీయురాలు, తండ్రి జమైకన్. ఈ ఎన్నికల్లో గెలవడంతో ఆమె మొదటి మహిళా ఉపాధ్యక్షురాలు, మొదటి ఇండియన్ అమెరికన్ ఉపాధ్యక్షురాలు, మొదటి నల్లజాతి మహిళా ఉపాధ్యక్షురాలు, మొదటి దక్షిణ ఆసియా అమెరికన్ మహిళా ఉపాధ్యక్షురాలు కాబోతున్నారు. కమలా హారిస్‌కి అమెరికాలా చాలా వర్గాల నుంచి భారీ మద్దతు ఉంది. ఆఫ్రికా అమెరికన్లు, ఆసియా అమెరికన్లు, దక్షిణ ఆసియా అమెరికన్లు, అంతేనా... 45 లక్షల మంది భారతీయ అమెరికన్లు ఆమెకు మద్దతిచ్చారు. ఆ 45 లక్షల మందిలో 19 లక్షల మందికి ఓటు వేసేందుకు హక్కు ఉంది. ఆ ఓట్లన్నీ కమలా హారిస్, జో బిడెన్‌ల డెమొక్రటిక్ పార్టీకి దక్కినట్లే.
జో బిడెన్ ఎప్పుడైతే అమెను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించారో... వెంటనే ట్రంప్... ఆమెను అసహ్యమైన మహిళ అని విమర్శించారు. అంతేనా దెయ్యం అన్నారు కూడా. అసలు ఆమె పేరును కూడా చాలాసార్లు ట్రంప్ కావాలనే వంకర టింకరగా పలికారు. ఐతే... ఇది ట్రంప్‌కి బూమరాంగ్ అయ్యింది. పదే పదే ఆమెను విమర్శించడం ప్రజలకు నచ్చలేదు. ఇంతకు ముందు బరాక్ ఒబామా విషయంలోనూ ఇలాగే జరిగింది. అప్పుడు ప్రజలు ఒబామా వైపే నిలిచారు. ఇప్పుడు కూడా హారిస్ వైపే నిలిచినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
జార్జియాలో ట్రంప్‌కి చాలా సపోర్ట్ ఉండేది. ఐతే... అక్కడ ట్రంప్ తాలూకు రిపబ్లికన్ సెనెటర్... డేవిడ్ పెర్డ్యూ... కమలా హారిస్ పేరును తప్పుగా పలికి... పకపకా నవ్వారు. దాంతో ప్రజలకు ఆగ్రహం కలిగింది. అదే సమయంలో... జో బిడెన్... అక్కడే ప్రచారంలో ఈ అంశాన్ని లేవనెత్తి... తమ తమ పేర్లకు ఉన్న అర్థాలు వివరించి... మమ్మల్ని మీరు ఎలా పిలుస్తారో... మీరే చెప్పండి... అలాగే పెట్టుకుంటాం అనడంతో... ప్రజలు జో బిడెన్ తీరు నచ్చి... ఒక్కసారిగా ట్రంప్‌కి రివర్స్ అయ్యారు. ఇట్లా కమలా హారిస్ తో పెట్టుకొని ట్రంప్ చతికిలపడినట్లైంది.
అసలే ట్రంప్‌కి నల్ల జాతి వ్యతిరేకత బాగా ఉంది. అలాంటి సమయంలో... ఇటు కమలా హారిస్ అదే నల్ల జాతి ప్రజలను బాగా ఆకర్షించారు. దాంతో... ఫలితాలన్నీ డెమొక్రాట్లకు అనుకూలంగా... ట్రంప్‌కి వ్యతిరేకంగా మారాయి. కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ హారిస్... బ్రెస్ట్ కాన్సర్ పరిశోధకురాలు. ఆమె... చెన్నై నుంచి అమెరికా వెళ్లారు. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో పుట్టిన కమలా హారిస్... ఈ రోజున భారతీయులకు ఓ ప్రేరణగా నిలుస్తున్నారు. 2016లో కాలిఫోర్నియా రాష్ట్రం తరపున అమెరికా సెనేట్‌కి ఎన్నికైన హారిస్... ఇప్పుడు మరో చరిత్ర సృష్టించబోతున్నారు.