అమెరికాలో భారీ సంఖ్యలో కొత్త కేసులు వస్తుండటంతో ఆస్పత్రులపై భరించలేని ఒత్తిడి పెరుగుతోంది. ఒమిక్రాన్ సహా ఇతర వేరియంట్ల ఉధృతితో ఆస్పత్రుల్లో చేరికలు పెరిగాయి. సోమవారం ఒక్కరోజే ఏకంగా 1,41,385 మంది వివిధ ఆస్పత్రుల్లో చేరారు. గతేడాది జనవరి 12 తేదీన అత్యధికంగా 29,534 మంది ఐసీయూల్లో చికిత్స పొందారు. ఈసారి సోమవారం నాటికి ఐసీయూల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 23,524కు చేరింది.
ఒమిక్రాన్ కారణంగా భారీ సంఖ్యలో వైద్య సిబ్బంది కరోనా బారిన పడటంతో కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కీలక నిర్ణయం తీసుకొంది. సార్స్‌కోవ్-2 పాజిటివ్‌గా నిర్ధారణ అయినా.. ఎలాంటి లక్షణాలు లేకపోతే.. సిబ్బంది ఎన్-95 మాస్కులు ధరించి విధులకు హాజరుకావాలని సూచించింది. వైద్య సిబ్బందికి జారీ చేసిన ఈ ఆదేశాలు జనవరి 8వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకూ తాత్కాలికంగా అమల్లో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.
కరోనా రోగి కాంటాక్ట్‌లోకి వెళ్లిన వైద్యసిబ్బంది కూడా లక్షణాలు లేకపోతే ఎలాంటి పరీక్షలు చేయించుకోకుండా ఎన్-95 మాస్కులు ధరించి విధులకు హాజరుకావాలని తెలిపింది. అయితే ఈ ఆదేశాలపై నర్సుల అసోసియేషన్లు వ్యతిరేకత తెలిపారు. వైరస్ సోకిన వైద్య సిబ్బంది విధుల్లోకి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు వాదిస్తున్నారు.