ఎమర్జెన్సీ ఆంక్షలను సైతం ధిక్కరించి జనం పెద్ద సంఖ్యలో రోడ్లపైకొచ్చి నిరసనలు తెలుపుతున్న క్రమంలో వారిని అదుపుచేసే పరిస్థితి లేకనే ఎమర్జెన్సీ ఎత్తివేతకు అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ మూకుమ్మడిగా రాజీనామాలు చేయడంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్స, ఆయన సోదరుడైన ప్రధానమంత్రి మహింద రాజపక్స ఇబ్బందుల్లో పడ్డారు. ప్రభుత్వం మైనార్టీలో పడింది.
ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరగ్గా, అధికార కూటమి నుండి 41 మంది సభ్యులు వాకౌట్ చేయడంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్స సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీని కోల్పోయింది. నిరసనల నేపథ్యంలో సోమవారం నాడు క్యాబినెట్ మంత్రులందరూ రాజీనామా చేశారు. ప్రభుత్వంలో చేరాలని అధ్యక్షుడు రాజపక్స చేసిన ఆహ్వానాన్ని శ్రీలంక ప్రతిపక్షం తిరస్కరించింది.
శ్రీలంక కొత్తగా నియమితులైన ఆర్థిక మంత్రి, అలీ సబ్రీ, ప్రమాణ స్వీకారం చేసిన ఒక రోజు వ్యవధిలోనే రాజీనామా చేశఆరు. ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహంతో మొత్తం మంత్రివర్గం రాజీనామా చేయడానికి గంటల ముందు ఆర్థిక దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలూ వచ్చాయి. శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ (SLFP) ప్రభుత్వం నుంచి వైదొలగడంతో పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ రంజిత్ సియంబలపిటియా పదవి నుంచి దిగిపోయారు.